Categories
Uncategorized

గ్రీన్ శారీ

నాకూ తొందరగానే శారీ సెలెక్ట్ చేద్దామని అనిపించింది…కానీ ఎన్ని చోట్ల వెతికినా అటువంటి శారీ దొరకడం లేదు.. ఒక్క శారీ సెలెక్షన్ కోసం నేను ఇంత టైం తీసుకోవడం మరియు ఇన్ని విధాలుగా ఆలోచించడం చూసి.. మా టీం మొత్తం నా వైపు చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు… అందులోనూ ఇప్పటికే రెండు రోజుల షూటింగ్ వాయిదా పడింది.

ఆ సీన్ ని నా పర్సనల్ లైఫ్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి రాశాను.. .. స్క్రీన్ ప్లే రాసుకున్నప్పుడే హీరోయిన్ డ్రెస్ “గ్రీన్ శారీ” అని రాసుకున్నాను.. నేను ప్రేమించి దూరం చేసుకున్న అమ్మాయి ఆ గ్రీన్ శారీ లో చాలా అందంగా వుంటుంది. తన ని ఆ శారీ లో చూసిన ప్రతిసారి … తన తో కలసి జీవించాబోయే ఆ అదృష్టవంతుడు నేనే అన్నట్టు ఫీల్ అవుతాను.. అంత అందంగా వుంటుంది తను ఆ శారీ లో.. అలాగే ఆ సీన్ లో, ఆ శారీ కి కూడా చాలా ఇంపార్టెంట్ వుంది..

కానీ ఇలా ..ఒక్క శారీ కోసం సినిమాని ఇంకా లేట్ చేయడం నాకు ఇష్టం లేదు… తర్వాత యాక్టర్స్ డేట్స్ కోసం చాలా కష్టపడాలి.. ఇంక..ఏ అమ్మాయినైతే ఊహించి ఆ సీన్ రాశానో.. తనకే కాల్ చేసి అడుగుదామనుకున్నాను….తన దగ్గర తప్పకుండా ఆ శారీ వుంటుందన్న నమ్మకం తో… కానీ ధైర్యం చాలలేదు..

తర్వాత ఆలోచించి… ఆలోచించి…
“ ఐ నీడ్ టు టాక్ టు యు” అని
తనకి వాట్స్ అప్ లో మెసేజ్ పెట్టాను..
బ్లూ స్టిక్స్ అయితే పడలేదు..
కానీ తను చదివే ఉంటుందని నమ్మకం..
మెసేజ్ పెట్టిన రెండు నిమిషాలకి తన భర్త తో ఒక మాల్ లో తీసుకున్న ఫోటోని డీపీ గా మార్చింది..
ఆ డీపీ అర్థం “నాకు పెళ్ళి అయ్యింది..ఇప్పుడేమి మాట్లాడ్తావు??”అంటూ నన్ను వెక్కిరించడం..లేదా ప్రశ్నించడం..ఏదైనా కావచ్చు!!
అప్పటి నుంచి ప్రతి నిమిషానికి చెక్ చేస్తున్నా…తన నుంచి రిప్లై వస్తుందేమో అని…
చివరికి 2 గంటల తర్వాత రిప్లై వచ్చింది..
***********************************
ఏంటీ?

ఐ నీడ్ ఎ స్మాల్ హెల్ప్

ఏంటీ?

నాకు నీ గ్రీన్ శారీ కావాలి..

నేను ఆ శారీ లో చాలా బాగుంటాను…
అనేవాడివి..అదేనా??

అవును. అదే…ఉందా??

కాల్చేదమనుకున్నా ఆ శారీని చాలా సార్లు…
కానీ ఎందుకో ఇంకా నా దగ్గరే పడి వుంది…..

రేపు వీలవుతుందా???…ఇవ్వడానికి

సరే ఇస్తాను.. ఎక్కడ??

నీకు దగ్గర్లో వుండే ప్లేస్.. ఏదైనా ఒకే..

మా ఇంటి దగ్గర వుండే కాఫీ షాప్ లో….
లొకేషన్ నీకు షేర్ చేస్తాను

ఓకేథ్యాంక్స్..బై
**********************************************************
ఇంతే.. మా మధ్య వాట్స్ అప్ సంభాషణ… మధ్యలో చాలా మాటలు టైప్ చేసి డిలీట్ చేశాను నేను… అలాగే తను కూడా…

నేను ఉండే చోటు నుంచి ఒక గంట ప్రయాణం..
తను ఖచ్చితంగా లేట్ గా వస్తుందని తెలుసు….అలాగే తను నా మాటలకు వెక్కిరింత….వ్యంగ్యం తో కూడిన సమాధానాలు ఇస్తుందని కూడా నాకు తెలుసు…
అయినా అన్నింటికీ సిద్ధపడీ.. చాలా తొందరగానే కాఫీ షాప్ లోకి వచ్చి కూర్చున్నాను..
ఊహించినట్టే తను గంటకు పైగా ఆలస్యంగా వచ్చింది…. తన ఇంటి నుండి ఈ కాఫీ షాప్ కి కేవలం పది నిమిషాల దూరం అంతే ..

నా ఎదురుగా వున్న చైర్ లో కూర్చొంది.. ఎప్పుడూ తనే ముందుగా పలకరించేది.. కానీ ఇప్పుడు, తన ఎదురుగా ఎవ్వరూ లేనట్టు మౌనంగా కూర్చొని వుంది…
నేనే ముందుగా “ఎలా వున్నావు?” అని పలకరించాను..
“మొదట్లో నిన్ను వద్దనుకొని….పెళ్లి చేసుకున్నాను కదా!!.. తప్పు చేశానేమోనని చాలా దిగాలుగా వుండేది….కానీ ఇప్పుడు ఫర్వాలేదు…నేను, మా ఆయన చాలా హ్యాపీగా ఉన్నాము..” అంది.
ఊహించిన సమాధానం…
మళ్ళీ మౌనం.. అటూ ఇటూ చూస్తుంది తప్ప ఎదురుగా వున్న నా వైపు చూడదు.. ఒకవేళ చూసినా.. అరక్షణం పాటు కూడా నా మీద చూపు నిలపదు….మళ్ళీ అటూ ఇటూ చూస్తుంది..
మళ్ళీ నేనే “నా మొదటి సినిమా షూటింగ్ మొదలైంది..” అని చెప్పాను..
తను “ ఆహా..” అంది.
“కేవలం “ఆహా…” నా.. నాకు సినిమాలు అంటే ఎంత ఇష్టమూ తెలుసు కదా!.. అందులోనూ నా మొదటి సినిమా. కనీసం కంగ్రాచ్యు లేషన్ కూడా లేదు..”
“సినిమా ఇప్పుడే కదా మొదలయ్యింది… పూర్తి అయ్యి , హిట్ అయిన తర్వాత చెప్తాను..” అని అంది… కానీ తన మొహం లో ఈ విషయం పట్ల ఎటువంటి ఉత్సాహం లేదు.. ఒకవేళ వున్నా కూడా, నా దగ్గర దాస్తుందేమో తెలియదు..
ఎందుకంటే..ఒకప్పుడు నేను అనుకున్నది సాధించాలని తనే ఎక్కువగా కోరుకునేది…

“సరే.. ఆ విషయం వదిలెయ్యి…ఈ మధ్య ఏమైనా సినిమాలు చూశావా?” అంటూ ..మళ్ళీ ఎదో ఒకటి మాట్లాడాలని ప్రయత్నించాను…
“నేను సినిమాలు చూడటం మానేసి రెండు సంవత్సరాలు అయ్యింది. మన బ్రేక్ అప్ తర్వాత నాకు సినిమాలు అంటే ఇష్టం పూర్తిగా పోయింది..”..అంది
ఇప్పటివరకూ తను మాట్లాడిన మాటలకి నా సహనం చచ్చిపోయినట్లు వుంది.. ఎక్కడో నా మనసులో అనుకున్న మాట పైకి వచ్చేసింది.. “నువ్వే కదా!! నీతో కలిసి బ్రతకడం కష్టం.. బ్రేక్ అప్ అని చెప్పింది..” అనేశాను
“అవును …నేనే వద్దనుకున్నాను.. కానీ తమరు మాత్రం నిమిత్త మాత్రులు కదా!!..”
ఒక క్షణం తర్వాత .. మళ్ళీ తనే “అమ్మాయి గా పుట్టి వుంటే తెలిసేది.. నా బాధ ఏంటో??..ఎన్ని రోజులు నిద్ర లేకుండా ఆలోచించానో తెలుసా!!..”
“దేని గురుంచి ఆలోచించావు…?” అడిగాను
“అందరు అమ్మాయిలు ఆలోచించేదే!!”
“ అదే….ఏమిటి?”
“ నీకు ….నేను ముఖ్యమా… కెరియర్ ముఖ్యమా?” అని”
“ఇలాంటి ప్రశ్న….నువ్వు నన్ను ఎప్పుడూ అడగలేదు”
“చాలా సార్లు అడుగుదామనుకున్నాను… కానీ భయం వేసింది.. ఎక్కడ నువ్వు నన్ను ఇబ్బంది పెట్టలేక… మౌనంగా వుంటావో!! అని…. అలాగే నీ కెరియర్ మీద నీకున్న పిచ్చి ని చూశాక.. ఆ భయమే నిజం అయింది… అందుకే, నేనే వద్దనుకొని వెళ్ళాను..”

“మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు?”
“కనీసం…నేను ఇప్పుడైనా అడుగుతున్నాను.. కానీ నువ్వు ఇప్పటికైనా నీ అసలు ముసుగు తీసి మాట్లాడటం లేదు …” అంది..
“ముసుగా??…అంటే”
“అంటే… అప్పుడు నేను వద్దు అని చెప్పినప్పుడు…నువ్వు ఎందుకు మౌనంగా వున్నావు?.. అలాగే మళ్ళీ ఎందుకు ఈ రోజు కలవాలనుకున్నావు? ..”
“ కేవలం శారీ కోసమే… ఒక ఫ్రెండ్ లా… నీ దగ్గర వుంటుందని అడిగాను.. అంతే”
“ కాదు… నువ్వు ఎందుకు వచ్చావో.. నేను చెప్పనా?… ఇప్పుడు నీ కెరియర్ గోల్ నువ్వు రీచ్ అయ్యావు ..సో మళ్ళీ నేను గుర్తొచ్చాను… ఇప్పుడు నేను కావాలి అనిపిస్తోంది.. నాతో వుండాలి అనిపిస్తోంది.. అది బయటకి చెప్పుకోలేక.. ఈ విధంగా నా ముందుకి వచ్చి కూర్చున్నావు..ఛీ….ఇంతకంటే పచ్చిగా మాట్లాడితే బాగోదు…ఇలాంటి చెత్త టెక్నిక్ లు సినిమాల్లో ఉపయోగించుకో.. చాలా బాగుంటాయి ..బయట కాదు” అంటూ శారీ ని టేబుల్ పైన పెట్టింది..

తను అలా.. నా మనసు లో నీచపు ఆలోచనలన్నీ బైటికి చెప్తుంటే… నా కళ్ళు పైకెత్తి తన వైపు చూడడానికే భయపడ్డాయి …తను బ్రేకప్ చెప్పినప్పడు …. నా కెరియర్ గురుంచి తప్పితే నేను దేని గురుంచి పెద్దగా బాధపడలేదు..కానీ ఇప్పుడు తను ఛీ కొడుతుంటే… బయటకి కన్నీళ్లు రావడం లేదు కానీ…నేను ఏడుస్తూ కూర్చున్నాను.. నా హిపోక్రసి మీద నాకే అసహ్యం కలిగింది..

తను వెళ్ళిపోయింది…కాఫీ షాప్ వదిలి…నన్ను కూడా శాశ్వతంగా వదిలి ….
************************************

2 replies on “గ్రీన్ శారీ”

Leave a comment