Categories
Uncategorized

మార్కెట్

జగదీశ్ డోర్ తీద్దాము అనుకునే లోపు తనే తీసుకొని హడావిడిగా లోపలికి వచ్చేసింది. నేరుగా వెళ్లి వెయిటింగ్ కస్టమర్స్ కోసం ఉన్న చెయిర్స్ లో కూర్చొంది. హ్యాండ్ బ్యాగ్ నుంచి పింక్ కలర్ వాటర్ బాటిల్ తీసి ఒక వైపు వాటర్ తాగుతూ మరో వైపు చుట్టూ చూస్తూ ఉంది. తర్వాత బ్యాగ్ నుంచి కొన్ని ఫైల్స్ తీసి, వాటర్ తాగడానికి తీసిన మాస్క్ మళ్ళీ పెట్టుకొని “May I Help You” బోర్డ్ ఉన్న కౌంటర్ వైపు నడిచింది.


ఈ రోజు బ్యాంక్ లో కస్టమర్స్ ఎక్కువగా లేకపోయే సరికి జగదీశ్ కి కాస్త ప్రశాంత సమయం దొరికింది. అతను 4 నెలల క్రితం ఈ బ్యాంక్ కి వాచ్ మెన్ గా చేరాడు.11:30 కావడంతో పక్కనే ఉన్న “మూకాంబికా మాత టీ స్టాల్” లో పనిచేసే శ్రీను దగ్గర జగదీశ్ టీ లు తీసుకొచ్చాడు. శ్రీను ఒక్కడితోనే అతనికి కాస్త పరిచయం ఎక్కువ. ఆ తర్వాత జగదీశ్ ఆఫీస్ లోని స్టాఫ్ అందరికీ టీ ఇవ్వడం మొదలుపెట్టాడు. 5వ కౌంటర్ లో ఉన్న మేడంకి టీ ఇవ్వబోతూ ఉంటే అతనికి ,ఇప్పుడే లోపలికి వచ్చిన అమ్మాయి మాటలు వినపడ్డాయి.


“మై నేమ్ ఈజ్ ప్రియాంక . ఐ యమ్ ఏ MBA గ్రాడ్యుయేట్ అండ్ ఐ హ్యావ్ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ అకౌంటింగ్ అండ్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ సార్”


“ఒకే మేడం, మీకు ఏమి కావాలి?” అని ఆ కౌంటర్ లో కూర్చొన్న బ్యాంక్ ఎంప్లాయీ అడుగుతున్నాడు

“ఇక్కడ వేకెన్సీ ఉంది అని తెలిసింది. అండ్ ఐ నీడ్ ఏ జాబ్ ఇన్ అర్జెంట్. దిస్ ఈజ్ మై CV సార్” అని తన చేతిలోని ఫైల్స్ ఇవ్వబోతూ ఉంటే, ఆ ఎంప్లాయీ తనకు ఏమీ అర్థం కానట్టు ముఖం తో సైగ చేసి చెప్పాడు. రోజూ బ్యాంక్ కి మనీ డిపాజిట్, విత్ డ్రా చేసే వాళ్ళు…లోన్ కోసం, ఇన్సూరెన్స్ పాలసీ కోసం తప్పితే ఇలా జాబ్ అడిగే అమ్మాయిని చూడటం కాస్త విచిత్రం గా అనిపించింది ఆ ఎంప్లాయీకి మరియు జగదీశ్ కి కూడా… ఇక్కడ ఉద్యోగం దొరుకుతుంది అనుకోవడం…ప్రియాంక ది కాన్ఫిడెన్సా? లేక అమాయకత్వమా? ఆ ఇద్దరికీ అర్థం కాలేదు.


తర్వాత ఆ ఎంప్లాయీ “చూడండి ప్రియాంక గారు, ఇక్కడ జాబ్స్ బ్యాంక్ ఎగ్జాంస్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్లకి మాత్రమే ఇస్తారు. మిగతావి సేల్స్ లో , ఇంకా చిన్న చిన్న వేకెన్సీలు ఉంటాయి. అంటే సెక్యూరిటీ, అటెండర్ అలాంటివి అన్నమాట. మీ చదువుకి తగ్గ జాబ్ లు ఇక్కడ దొరకవు. కానీ, మీరు ఇలా డైరెక్ట్ గా వచ్చి అడిగిన విధానం నాకు బాగా నచ్చింది .కావాలంటే సేల్స్ లో ఫీల్డ్ జాబ్ ఉండొచ్చు…కనుక్కుంటాను” అని ఆమెకి భరోసా ఇస్తున్నట్లు చెప్పాడు.


“ ఓ…థ్యాంక్స్ సార్. సేల్స్ లో ఫీల్డ్ జాబ్ అంటే… లేడీస్ కి కొంచెం కష్టం అవుతుంది కదా!“ అని కాస్త అసహనంగా ముఖం పెట్టి చెప్పింది. మళ్ళీ తనే “బ్యాంక్ లో నా స్కిల్స్ తో మ్యాచ్ అయ్యేలా రిలేటెడ్ జాబ్ ఉంటే చూడగలరా? అని అడగబోతూ ఉంది.
దానికి ఆ ఎంప్లాయీ “చూడండి ప్రియాంక గారు, ఈ లాక్ డౌన్ వల్ల జాబ్ మార్కెట్ బాగా పడిపోయింది. ఫస్టు ఈ సమయంలో జాబ్ దొరకడం అంటేనే చాలా కష్టం. ఒకసారి ఆలోచించుకోండి.” అన్నాడు.

“నో నీడ్ సార్. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్” అని చెప్పి ఆమె కస్టమర్ చెయిర్ వద్దకు వెళ్ళి ఫోన్ లో మాట్లాడుతూ ఉంది. ఫోన్ లో ఆమె మాటల్ని బట్టి , ఇప్పుడు ఆమెకి జాబ్ చాలా అవసరం అని జగదీశ్ కి అర్థమయింది. అందరికీ టీలు ఇచ్చిన తర్వాత కాసేపు తన చెయిర్ లో కూర్చొని ప్రియాంక వైపు చూస్తూ ఆలోచన లో పడ్డాడు .అతనికి 4 నెలల క్రితం జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది.


************.                *************

లాక్ డవున్ వలన ,జగదీశ్ ఉద్యోగం పోయి అప్పటికి కేవలం 2 నెలలు మాత్రమే అయ్యింది. అతని తండ్రి రోజూ కూలీగా పనిచేసేవాడు. ఒకరోజు అతని తండ్రి కి జలుబు చేసింది. అలాగే రెండు రోజులకి దగ్గు కూడా మొదలయ్యింది. జగదీశ్ దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రి లో కరోనా టెస్టు చేయించాడు. ఆ రిజల్ట్ నెగిటివ్ రావడానికి వారం పట్టింది. కానీ అతని తండ్రి భయంతో మూడు రోజులకే చనిపోయాడు.

ఒక చిన్న ప్రైవేట్ స్కూల్ టీచర్ గా జగదీశ్ జీతం చాలా తక్కువ. అతని జీతం,తన తండ్రి సంపాదనతో ఇంటి అవసరాలు ఎలాగోలా తీరుతూ ఉన్నాయి. ఇప్పుడు అతని పరిస్థితి మరీ దారుణం అయ్యింది. ఎప్పుడూ ఇలా ఖాళీగా లేడు. తండ్రి లేకపోవడంతో భవిష్యత్ లా ఉంటుందో అన్న భయం కూడా వేసింది.

ఇలా ఉండగా, ఒకరోజు ఎవరో తెలియని వ్యక్తి తనకి బైక్ లో లిఫ్ట్ ఇస్తే అతని దగ్గర జగదీశ్ తప్పు చేసిన వాడిలా నేల చూపులు చూస్తూ, మొహమాట పడుతూ అడిగాడు.

“అన్నా, నాకు జాబ్ లేదు, ఏదేనా ఒక జాబ్ ఉంటే చూస్తారా! ఏదేనా పర్వాలేదు…ప్లీజ్ అన్న” అని. జగదీశ్ అమాయకత్వం, దిగులుగా వున్న అతని ముఖం చూసి కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు ఆ వ్యక్తి.

“నువ్వు చదువుకున్న వాడి మాదిరి ఉండావు… మేము ఏవో చిన్న చిన్న పనులు చూపిస్తాము. అయ్యి నువ్వేమీ చేస్తావు చెప్పు”

“అన్న…ఇప్పుడు ఇంట్లో పరిస్థితి మరీ కష్టంగా ఉంది… బైక్ లో మీ మాటల్ని విన్న తరువాత, మీకు టౌన్ లో పరిచయాలు బాగనె ఉన్నట్టు అనిపించి అడిగాను. నాకు జాబ్ లు ఇప్పించె వాళ్ళు పెద్దగా తెలియదు…మీ చేతుల్లో ఉండే పని అయితే తప్పకుండా చూడు అన్నా. ప్రస్తుతం నా పరిస్థితి గురించి మీకు కూడా చెప్పాను” మాట్లాడుతూ మధ్యలో తనకి కన్నీళ్లు రావడం గమనించి, టక్కున జగదీశ్ తల అటువైపు తిప్పుకున్నాడు.

ఏంటి తమ్ముడు, నువ్వు ఉత్త అమాయకుడి మాదిరి ఉండావు…” అని బైక్ లో ఉన్న వ్యక్తి జగదీశ్ వివరాలు కనుక్కున్నాడు.

“ నువ్వు టీచర్ జాబ్ ఇచ్చే ఏదేనా స్కూల్ వాళ్లను అడగాలి కానీ, ఎవరో దారిని పోయె అనామకున్ని అడిగితే ఎలా వస్తుంది జాబ్?…అయినా ఇప్పుడు స్కూల్స్ కూడా బంద్ కదా” అనేసి ఆలోచించడం మొదలుపెట్టాడు…కాసేపు తర్వాత ఎవరికో ఫొన్ చేసి జగదీశ్ ముందరే మాట్లాడాడు. ఆ రోజు జగదీశ్ నంబర్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఒక రెండు రోజుల తర్వాత కాల్ చేసి, మొదటగా ఇప్పుడు జాబ్ మార్కెట్ పడిపోయింది అన్నాడు… ఆ తర్వాత ఇప్పుడు చేస్తున్న వాచ్ మెన్ జాబ్ గురించి చెప్పి , చేస్తవా ? అని అడిగితే ..జగదీశ్ కూడా సరే అని చేరిపోయాడు.

************* **************

ప్రియాంక కూడా జగదీశ్ లాగే జాబ్ అడగడానికి వచ్చింది. ఆమెకీ జాబ్ చాలా అవసరం. కానీ ఎక్కడా భయపడకుండా , చాలా కాన్పిడెంట్ గా అడిగింది. ఆమె స్కిల్స్ తో మ్యాచ్ అవ్వని జాబ్ ఇస్తామని చెబితే, ఏమీ ఆలోచించకుండా నో చెప్పిన తీరు గురించి జగదీశ్ ఆలోచిస్తూ ఉండిపోయాడు…ఆ సంఘటన అతని ఆలోచనలలో చాలా మార్పునే తీసుకొని వచ్చింది. ఒక 3 నెలలు తర్వాత తను చేస్తున్న వాచ్ మెన్ పని మానేసి, టీచింగ్ లో తనకు దొరికే జాబ్స్ గురించి కనుక్కోవడం మొదలుపెట్టాడు. కొన్నిచోట్ల ఇంటర్యూలకి అటెండ్ అవుతున్నాడు.


***************            *************

ఈ రోజు జగదీశ్ ఒక కార్పొరేట్ స్కూల్ లో ఇంటర్యూ కి అటెండ్ అవ్వబోతున్నాడు .ఆటోలో నుంచి దిగి స్కూల్ ఎదురుగా నిల్చొని ఉన్నాడు. దారిలో వచ్చేటప్పుడు ఇంటర్యూ ప్రశ్నలకి ఎలా ఆన్సర్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆటో డ్రైవర్ కి డబ్బులు ఇవ్వబోతూ ఉంటే అతన్ని గుర్తుపట్టిన ఆటో డ్రైవర్ మాస్క్ తీసి “మీరు జగదీశ్ కధా!!…సార్” అని పలకరించింది. జగదీశ్ కి అప్పుడు తెలిసింది ఆ డ్రైవర్ ఆడమనిషి అని. అతను తలఎత్తి చూశాడు. ఎదురుగా చీర పైన ఖాకీ రంగు చొక్కా వేసుకొని ఆ రోజు బ్యాంక్ కి ఉద్యోగం కోసం వచ్చిన “ప్రియాంక”. ఆమెకి డబ్బులు ఇస్తూ “ఏమిటి, మీరు ఇలా….” అని ఆమె ఉద్యోగం గురించి అడగబోయాడు. అది గ్రహించిన ప్రియాంక తానే ముందుగా “సార్ , మీరు కనపడితే మీకు నా గురించి చెప్పాలని అనుకున్నాను” అంది. ఆమె తనకు ఏమి చెప్పాలనుకుంటున్నదా? అన్న ప్రశ్న అతనిలో ఎక్కువ అయింది.


ఎదురుగా ఒక చిన్న కిరాణాకొట్టు కనపడితే, కాసేపు కూర్చొని కూల్ డ్రింక్ తాగుతూ మాట్లాడవచ్చని అక్కడికి వెళ్ళారు. ఆ కిరాణాకొట్టు యజమాని బ్యాంక్ దగ్గర టీ స్టాల్ లొ పనిచేసే శ్రీను. జగదీశ్ గుర్తుపట్టి పలకరించాడు. ఆ తర్వాత శ్రీను…అక్కడ స్టాల్ సరిగా నడవలేదని, అందుకే ఓనర్ అతన్ని తీసేశాడని చెప్పాడు. అతని దగ్గర మిగిలిన కాస్త డబ్బులతో ఈ చిన్నకొట్టు పెట్టుకున్నానని సంతోషముగా చెప్పాడు.


కూల్ డ్రింక్ తాగుతూ ప్రియాంక చెప్పడం మొదలుపెట్టింది.


“నా స్కిల్స్ కి తగ్గ జాబ్స్ కోసం వెతికి…వెతికి అలసిపోయాను. ఆ తర్వాత ఏదేనా చిన్న జాబ్ చేయడానికైనా సిద్ధపడ్డాను. మళ్ళీ ఆ బ్యాంక్ కి వచ్చి అడిగితే ఆ సేల్స్ జాబ్ కూడా లేదన్నారు. ఈ లాక్ డవున్ వలన చిన్న జాబ్స్ దొరకడం కూడా చాలా కష్టం అయ్యింది సార్. మా నాన్న గారు ఆటో డ్రైవర్ గా పనిచేస్తారు. మా సేవింగ్స్ చాలా తక్కువ. కొన్ని అప్పులు కూడా ఉన్నాయి.”


ఆ సమయంలో జగదీశ్ కి హఠాత్తుగా చనిపోయిన అతని తండ్రి గుర్తొచ్చి, ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు. అతన్ని చూసి ప్రియాంక కాసేపు మాట్లాడటం ఆపేసింది. మళ్ళీ జగదీశ్ “మరి ఆటొ డ్రైవర్ గా ఎందుకు చేస్తున్నారు ? “ అని ప్రియాంక వైపు చూసి అడిగాడు.


“ఆ రోజు బ్యాంక్ నుంచి బయటకి వచ్చిన తర్వాత పక్కనే ఉన్న టీ స్టాల్ లొ టీ తాగుతూ ఉన్నాను. అక్కడ పనిచేసే ఈ శ్రీను మీ గురించి ఎవరితోనో చెబుతూ ఉన్నాడు. టీచర్ గా పనిచేసిన మీకు ఆ జాబ్ పోయిందని…మీ చదువుకి , ఎక్స్‌పీరియన్స్ కి తగిన జాబే చేయాలి అని ఖాళీగా ఉండకుండా… బ్యాంక్ లో మీరు చేస్తున్న వాచ్ మెన్ పని గురించి చెప్పాడు… నాకు మీరు ఒక పాఠం లా కనిపించారు. నేనూ ఈ జాబ్ ప్రయత్నాలు మానేసి, మా నాన్న గారి దగ్గర ఆటో డ్రైవింగ్ నేర్చుకున్నాను. 2 నెలల్లో లైసెన్స్ కూడా వచ్చింది. మళ్ళీ ఫ్యూచర్ లొ ఎలాంటి లాక్ డవున్ లు వచ్చినా ఈ పని నాకు హెల్ప్ అవుతుంది అనుకున్నాను…”అంది ప్రియాంక.


జగదీశ్ కి కాస్త ఆశ్చర్యంగా అనిపించింది. అతను “తనకి జాబ్ వెతుక్కోవడం చేతకాక ఏ వాచ్ మేన్ పని చేస్తున్నాడని భావించాడో”… అదే పనిని ప్రియాంక చూసిన తీరు…ప్రియాంక తన ఆలోచనని మార్చుకుంది అని చెప్పేసరికి అతనికి కాస్త గర్వంగా అనిపించింది. దానితో పాటు కొద్దిపాటి నవ్వు కూడా వచ్చింది. కొట్టు దగ్గరికి వచ్చే కస్టమర్స్ ని పట్టించుకుంటూ వీళ్ళ మాటలని సగం సగం విన్న శ్రీను “చదువుకి తగ్గ జాబ్ చేయాలి…అనుభవానికి తగ్గ జాబ్ చేయాలి అని అందరూ ఊకే కూర్చొని ఉంటే బతకడం ఎల్లా సార్.” అని తనకు తోచింది చెప్పాడు.


ఆ రోజు బ్యాంక్ లో ప్రియాంక మాట్లాడిన తీరు తన ఆలోచనని ఎలా మార్చింది చెప్పి, ఆమెకు కూడా జగదీశ్ తన ధన్యవాదాలు తెలియజేశాడు. ఇద్దరూ కాసేపు ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు. ఆ నవ్వుకి అతనికి నోట్లో పొరపోయి కాస్త దగ్గు వచ్చింది. నీళ్లు తాగమని తన పింక్ కలర్ వాటర్ బాటిల్ ని ప్రియాంక అతనికి ఇచ్చింది.

ప్రియాంక “మీరేమో నేను మాట్లాడింది విని, మీ పని మానేసి … మీ చదువుకి, ఎక్స్‌పీరియన్స్ కి తగ్గ జాబ్ కోసం వెతుకుతున్నారా!!! భలే తమాషాగా ఉన్నాయి సార్ మన జీవితాలు. మన ఆలోచనలు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇంటర్యూ” అంది. మళ్ళీ శ్రీను “కోటి విద్యలు కూటి కొరకే సార్“ అని తనకి తెలిసిన మాట ఏదో ఇద్దరికీ చెప్పబోయాడు.

వాళ్ళకు కలిగిన అనుభవాలకి, ఆలోచనలకి…వాళ్ళు చేస్తున్న పనులకి…వాళ్ళ చదువులకి…శ్రీను చెప్పిన మాటకి ఎక్కడా పొంతన కుదరకపోవడంతో ఇద్దరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎందుకంటే వాళ్లకి ఈ లాక్ డవున్ వలన కోటి విద్యలకీ మార్కెట్ ఉంటేనే కూడు పెడతాయి అని తెలిసింది ఏమో!…


కూల్ డ్రింక్ కి డబ్బులు ఇచ్చి జగదీశ్ స్కూల్ వైపు, ప్రియాంక ఆటో వైపు నడుస్తూ వెళ్ళారు.

Leave a comment