Categories
Uncategorized

బీర్ బాటిల్స్

ఊరి సెంటర్లో వున్న టీకొట్టు దగ్గర నిల్చొని రెండు టీలు చెప్పాడు ప్రణయ్.
గాయత్రి ఆ టీకొట్టు ఎదురుగా ఇంటి గోడ మీద ఉన్న పోస్టర్ వైపు చూస్తూ నిలబడింది.
ప్రణయ్ గాయత్రికి దగ్గరగా వచ్చి “ఏంటి ..ఆ పోస్టర్ వైపు అంతసేపు చూస్తున్నావు?“ అని అడిగాడు. గాయత్రి చెప్పబోతుండగా కొట్టులో నుంచి అదే ఊళ్లో తొమ్మిదో తరగతి చదువుతున్న టీకొట్టు గురవయ్య కొడుకు రాము ఇద్దరికీ టీ ఇచ్చి వెళ్ళాడు.

రాము ఇచ్చిన టీని సిప్ చేస్తూ గాయత్రి “ ఆ పోస్టర్ లోని హీరో… చేతిలో బీర్ బాటిల్ పట్టుకోవడం చూస్తే మన వయసుకు చాలా మామూలు విషయంలా అనిపిస్తుంది కదా!! కానీ అదే పోస్టర్ ని రోజూ ఎదురుగా చూస్తున్న రాము మనసులో ఎంత గందరగోళం వుంటుందా ! అని ఆలోచిస్తున్నా!” అని చెప్తూ ప్రణయ్ వైపు చూసింది .

దానికి ప్రణయ్ “రాము కి కూడా అది ఒక మాములు సినిమా పోస్టర్ గానే అనిపిస్తుంది. అంతకు మించి ఏమీ ఉండదు. నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు .“ అని వాళ్ళిద్దరు తాగిన కప్పులను అక్కడ కొట్టులో పెట్టి డబ్బులు ఇచ్చి బైక్ లో టౌన్ కి బయలుదేరారు.


వెనక వెళ్తున్న చెట్లని , తారు రోడ్డును బైక్ లెఫ్ట్ మిర్రర్ లో నుంచి గమనిస్తూ
“రాము, ఆ పోస్టర్ ని మనంత సహజంగా …చాలా మాములుగా విషయంగా తీసుకోలేడు. అతని మనస్సులో ఆ వయస్సుకి సంభందించిన చాలా గందరగోళం ఉంది. ఈ రోజు నేను తనతో మాట్లాడినప్పుడు అనిపించింది” అంది గాయత్రి.

తొందరగా రూమ్ కి వెళ్ళాలన్న ఆలోచనతో బైక్ ని ఫాస్ట్ గా నడుపుతున్న ప్రణయ్, గాయత్రి మాట్లాడటం మొదలుపెట్టేసరికి నెమ్మది చేశాడు. టీకొట్టు దగ్గర ఆమె ఎందుకు అలా మాట్లాడి వుంటుందని అర్థం అవ్వసాగింది.
తర్వాత ప్రణయ్ గాయత్రిని “బస్సు ఏ టైం కి బుక్ చేసుకున్నావు ?” అని అడిగాడు
“9:30 కి . ఇంకా మూడు గంటలు వుందిలే” అంది. అప్పుడు గుర్తొచ్చింది ఆమెకి ఈ రోజు వెళ్ళిపోతున్న సంగతి. ఒక వారం రోజుల ముందు గాయత్రికి ప్రణయ్ కి మధ్య యే పరిచయం లేదు. మళ్ళీ రేపటి నుండి వారిద్దరి మధ్య మాటలు కూడా వుంటాయో లేదో తెలియదు!!!!


వారం రోజుల క్రితం


ప్రణయ్ బస్టాండ్ లో గాయత్రి కోసం వెయిట్ చేస్తూ వున్నాడు. తను ఒక NGO తరపున గవర్నమెంట్ ప్రాజెక్ట్ లో భాగంగా ఇక్కడ సెలెక్ట్ చేయబడిన rural స్కూల్స్ లో కంప్యూటర్ ట్రైనర్ గా వర్క్ చేస్తున్నాడు. రెండు రోజుల ముందు, ప్రణయ్ మేనజర్ శివాని ఫోన్ చేసి గాయత్రి గురుంచి , గాయత్రి adolescences issues మీద చేస్తున్న రిసెర్చ్ వర్క్ గురుంచి చెప్పి ఆమెకి ఫీల్డ్ లో కాస్త హెల్ప్ చేయమని అడగడంతో…అందుకు తను కూడా సరే అన్నాడు. ముందు రోజు గాయత్రితో ఫోన్ లో మాట్లాడాడు. గాయత్రి ఇక్కడ ఒక వారం రోజులు వుండటానికి హోటల్ లో ఒక రూమ్ ని బుక్ చేయమని అతన్ని అడిగింది.


అప్పుడే హైదరాబాద్ నుండి వచ్చిన బస్సులో గాయత్రి దిగింది. ఆమెను, ఆమె లగేజీని చూడగానే ప్రణయ్ కి ఆమె సిటీలో పుట్టి పెరిగిన అమ్మాయిలా అనిపించింది. తర్వాత గాయత్రిని లాడ్జ్ దగ్గరికి తీసుకెళ్ళి, ఈ టౌన్ లోనే ఇది బెస్ట్ లాడ్జ్ అని చెప్పాడు. ఆ లాడ్జ్ ని చూడగానే గాయత్రికి చాలా అసౌకర్యంగా అనిపించింది. కానీ పైకి చెప్తే బాగోదని రూమ్ బాయ్ తో కలసి రూమ్ చూడటానికి లిఫ్ట్ లో థర్డ్ ఫ్లోర్ కి వెళ్ళింది. Reception లోని సోఫాలో ప్రణయ్ కూర్చొని వున్నాడు. ఒక ఐదు నిమిషాల తర్వాత గాయత్రి కిందికి వచ్చింది.

ప్రణయ్ కి దగ్గరగా వచ్చి “ మీతో కాస్త మాట్లాడాలి ?” అంది.
“చెప్పండి. పర్వాలేదు”
గాయత్రి Reception table లో కూర్చొన్న వ్యక్తి కి వినపడకుండా చాలా నెమ్మదిగా
“ రూమ్ అస్సలు బాగా లేదు. ఈ టౌన్ లో ఇదే బెస్ట్ అని మీరు అంటున్నారు. కానీ ఇక్కడ వుండాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. బయట ఎక్కడైనా రెంట్ కి ఒక రూమ్ చూడగలరా?“ అని అడుగుతూ ప్రణయ్ మొఖం వైపు చూస్తె అతని ఎడమ చెంప మీద డింపుల్ ని మొదటిసారి చాలా స్పష్టంగా చూసింది తను. అతని మొఖంలో చిన్నచిరునవ్వు కనిపించింది. అతను అదే నవ్వు మొఖంతో “ఇది చాలా చిన్న టౌన్. ఇక్కడ లాడ్జ్ లో రూమ్ లు ఇలాగే వుంటాయి. ఈ విషయం నిన్ననే మీకు ఫోన్ లో చెపుదామని అనుకున్నా!. కానీ మీ మాటల్ని బట్టి చూస్తె మీరు నేను చెప్పిన విషయానికి కన్విన్స్ కారు అనిపించింది. ప్రాక్టికల్ గా చూస్తె మీకే తెలుస్తుంది అని చెప్పలేదు….కానీ ఇప్పుడు మీరు యే టెన్షన్ పడొద్దు. నేను ఆల్రెడీ నా రూమ్ ఓనర్ వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళతో పాటు మీరు వుండొచ్చు“ అని చెప్పాడు.
“ తెలియని వాళ్ళ ఇంట్లో వుండాలి అంటే ….” అని కాస్త సందేహంగా అతని వైపు చూసింది.
“వాళ్లకి ఏ పట్టింపులు లేవు. వాళ్ళ పిల్లలందరూ ఫారిన్ లో వుంటున్నారు. మీతో చాలా బాగా మాట్లాడుతారు, బాగా కలసిపోతారు కూడా. ఇంకేమీ ఆలోచించకండి…” అని ప్రణయ్ భరోసా ఇచ్చేసరికి గాయత్రి కూడా సరే అంది.

తర్వాత ఆమెని ఇంటి దగ్గరికి తీసుకెళ్ళాడు. గాయత్రి బైక్ లో నుంచి కిందికి దిగుతుంటే ఆమె హ్యాండ్ బ్యాగ్ లో నుంచి ఒక ఇంగ్లీష్ నవల కింద పడింది. ఆ పుస్తకాన్ని చూసి ప్రణయ్“ మీకు పుస్తకాలు చదవడం అంటే బాగా ఇష్టమా ?” అని అడిగాడు.
“నవలలు, లవ్ స్టోరీస్ చదవడం అంటే బాగా ఇష్టం. మరి మీకు ?”.
“ మీరేమీ అనుకోవద్దు. నాకు చదవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. చిన్నప్పుడు కేవలం “చందమామ” మాత్రం చదివాను. అదికూడా నాకు బాగా ఇష్టమైన “విక్రమార్క, బేతాళ కథలు” కోసమే చదివేవాడిని” అనేసరికి గాయత్రి చిన్నగా నవ్వింది. మొదటిసారి ఆమె నవ్వేసరికి, ప్రణయ్ చూపులు ఆమె ముఖాన్ని కాసేపు ఎక్కువగా చూడటానికి ప్రయత్నించాయి. ఆమె పెట్టుకున్న ముక్కెర ముఖానికి ఇంకాస్త అందాన్ని పెంచింది అనిపించింది.


తర్వాత ప్రణయ్ గాయత్రికి ఇంటి ఓనర్స్ అయిన జానకిరాం దంపతులని పరిచయం చేశాడు. ఇద్దరి వయసు యాభై పైనే వుంటుంది. వాళ్ళు మాట్లాడే విధానం చూసి ఆమెకి ఇక్కడ వుండగలను అన్న ధైర్యం వచ్చింది. ప్రణయ్ ఆ ఇంటి మిద్దెపైన రూమ్ లో అద్దెకి వుంటాడు. ఆ రూమ్ కి ముందుర చాలా ఖాళీ స్థలం వుంది. ఆ ఖాళీ స్థలంలో కొన్ని మొక్కల్ని పెంచుతున్నారు ఆ దంపతులు. అతనంటే వాళ్లకి చాలా మంచి అభిప్రాయం వుంది.


మొదటి రోజు గాయత్రిని తనతో పాటు స్కూల్ కి తీసుకెళ్ళాడు. అక్కడ తన రిసెర్చ్ కోసం గాయత్రి 8 నుంచి 10 వ తరగతి విద్యార్థులతో మాట్లాడటం మొదలుపెట్టింది. కొంతమంది పిల్లల దగ్గర ప్రైవేట్ గా interview లు తీసుకుంది. ప్రణయ్ క్లాస్ చెప్పడం పూర్తి అయిన తర్వాత ఇద్దరూ టౌన్ కి తిరుగు ప్రయాణమయ్యారు.
దారిలో గాయత్రి “పిల్లలకి మీరు చాలా ఇంట్రెస్టింగ్ గా ట్రైనింగ్ ఇస్తున్నారు. బయట నుంచి నేను ఒక పది నిమిషాలు చూశాను. సూపెర్బ్ క్లాస్”. దానికి బదులు గా ప్రణయ్ “థ్యాంక్యు అండి “ అని రోడ్డు పక్కన టీకొట్టు కనపడేసరికి బైక్ ని నిలిపాడు.
గాయత్రి “ సిగరెట్ కోసమా ?” అని అడిగింది.
“కాదు, టీ కోసం “ అన్నాడు.
తను ఏదో తప్పుగా మాట్లాడినట్లు భావించి “రియల్లీ సారీ… ఏదో పొరపాటుగా అడిగేశాను , ఏమీ అనుకోవద్దు “అంది.
“పరవాలేదు. నా పెదాలు చూసి మీకు అలా అనిపించి వుండొచ్చు. అయినా ,ఒకప్పుడు నేను సిగరెట్లు బాగా కాల్చేవాడిని . కానీ ఈ జాబ్ లోకి వచ్చాక మానేశాను “ అని చెప్పాడు .అది విని గాయత్రికి ఆశ్చర్యంగా అనిపించి “ ఈ జాబ్ లో చేరాక మానేశారా ? ఎందుకు ?” అని అడిగింది.
ప్రణయ్ కాసేపు తటపటాయించి తర్వాత కాస్త నెమ్మదించినట్లుగా “ నేను రోజూ క్లాస్ తీసుకుంటున్న పిల్లలు అప్పుడప్పుడు నేను సిగరెట్ తాగడం చూసేవాళ్ళు. వాళ్ళు చూడటం నాకు చాలా ఇబ్బందిగా వుండేది. అలాగే, నన్ను బాధ పెట్టిన ఇంకో విషయం ఏమిటంటే… ఈరోజు మనం వెళ్ళిన స్కూలులో కార్తిక్, నిరంజన్ అని ఇద్దరు 8 తరగతి విద్యార్థులు ఒక రోజు సిగరెట్ తాగుతూ నాకు కనపడ్డారు. వాళ్లకి అలా చేయడం తప్పని ఎలా చెప్పాలో తెలియలేదు. నేను మాత్రం వాళ్లు ఈ విధంగా చేయడానికి ఒక inspiration కాకూడదని , అప్పటి నుండి సిగరెట్ మానేశాను.” అని చెప్తూ అతని కుడి చేతి ఉంగరపు వేలిని గట్టిగా తడుముతూ వున్నాడు. ప్రణయ్ చెప్పింది విన్న తర్వాత గాయత్రికి అతను చాలా sensible person లా అనిపించాడు. తర్వాత టీ తాగి ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు.


ఆ రోజు రాత్రి గాయత్రి ఆరుబయట మెట్ల పైన కూర్చొని కాసేపు బుక్ చదువుకుందామని మిద్దెమీది కి వెళ్ళింది. అక్కడ ప్రణయ్ చేతిలో బీర్ బాటిల్ పట్టుకొని చైర్ లో కూర్చొని ఆకాశంలోకి చూస్తూ వున్నాడు. అతని రూమ్ పక్కన పడివున్న బీర్ బాటిళ్ళు ,బీర్ కేసు బాక్సులు చూసి అతనకి రెగ్యులర్ గా తాగే అలవాటు వుందేమో అనుకొంది . మెట్ల మీద కూర్చొని బుక్ ఓపెన్ చేసి చదువుకోసాగింది. కాసేపాగి గాయత్రి ప్రణయ్ వైపు తిరిగి “ మీకు పుస్తకాలు చదవడం ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ వేరే వాళ్ళు చదివితే వింటారా ?” అని అడిగింది.
అప్పుడు ప్రణయ్, గాయత్రి ఎందుకు ఇలా అడుగుతుందో తెలియక ,ఓపెన్ చేయని బీర్ బాటిల్ ని పక్కన పెట్టి “వినటానికి నాకు ఏ ప్రాబ్లం లేదు“ అన్నాడు.
“ఇప్పుడు వినడం మీకు ఓకేనా ?” అని మళ్ళీ అడిగింది. దానికి బదులుగా అతను సరే అన్నట్లు తల ఊపాడు, కానీ మీరు చదువుతున్న నవలలు, ప్రేమకథలు మాత్రం వినాలంటే చాలా కష్టమని చెప్పాడు. దానికి గాయత్రి ఒక్క క్షణం ఆలోచించి “ సరే, మీకు ఇష్టమైన బేతాళ కథలే చదువుతాను” అంది. తర్వాత ఫోన్ తీసుకొని క్రోమ్ లో చందమామ బుక్స్ ఆర్కైవ్స్ కోసం వెతికి అవి కనపడేసరికి అందులో నుంచి “ మంత్రపుటుంగరం” అనే కథను చెప్పడం మొదలు పెట్టింది. గాయత్రి స్వరం, మాటల ఉచ్ఛారణ చాలా బాగుండేసరికి అతను శ్రద్ధగా వింటున్నాడు. ఆ కథను చదివిన తర్వాత ఇద్దరూ “విక్రమార్కుడు, బేతాళుడికి ఇచ్చిన సమాధానం సరైనదేనా ?” అని ఒక గంటకు పైగా చర్చించుకున్నారు. ఆ తర్వాత గాయత్రి నిద్రపోవడానికి కిందికి వెళ్ళింది.


వారం రోజుల పాటు , ప్రతి రోజూ గాయత్రిని తను వర్క్ చేస్తున్న స్కూల్స్ కి తీసుకెళ్ళేవాడు ప్రణయ్. తర్వాత ఇద్దరూ ఆ రోజు స్కూల్ లో జరిగిన సంఘటనల గురుంచి మాట్లాడుకునేవారు. రాత్రి పూట గాయత్రి ప్రణయ్ కి ఒక బేతాళ కథని చదివి వినిపించేది. తర్వాత ఇద్దరూ విక్రమార్కుడి సమాధానం గురుంచి చర్చించుకునేవారు. మొదటి రోజు “మీరు, అండీ “ అని పిలుచుకున్న ఇద్దరి మధ్య వారం రోజులకి “నువ్వు, నీకు“ అనేంతలా చనువు పెరిగింది.
***************. ****************
ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. గాయత్రి తన లగేజీ మొత్తం సర్దుకొని , తనని ఇన్ని రోజులూ సొంత బిడ్డలాగా చూసుకున్న ఆ దంపతులకి ఒక గిఫ్ట్ ని ప్రెజెంట్ చేసి వారి నుంచి సెలవు తీసుకుని, బైక్ దగ్గర ప్రణయ్ కోసం వెయిట్ చేయసాగింది. కొద్దిసేపటి తర్వాత ప్రణయ్ ఒక పెద్ద ప్లాస్టిక్ సంచితో కిందికి వచ్చాడు.
ఆ సంచిని చూసి “ఏమున్నాయి ఇందులో?” అని అడిగింది గాయత్రి .
“ నా ఫ్రిడ్జ్ లో వున్న బీర్ బాటిల్స్ “
“ఇప్పుడు వీటిని ఎందుకు సంచిలో వేశావు ?”
“ పారేయడానికి”
“అవునా!!…ఎందుకు పారేస్తున్నావు?” అని అడిగింది గాయత్రి.
అప్పుడు ప్రణయ్ ఆ ఇంటికి ఎదురుగా బాల్కనిలో కూర్చొని పుస్తకం చదువుతున్న 17 సంవత్సరాల సంజయ్ వైపు చూశాడు. అతని చూపుని బట్టి గాయత్రి ఈ విషయాన్ని లీలగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించసాగింది.


దారిలో కొద్దిసేపు ఇద్దరూ మౌనంగా వారి ఆలోచనల్లో మునిగివున్నారు. తర్వాత ప్రణయ్ మాట్లాడటం మొదలుపెట్టాడు. “ నేను 8వ తరగతిలో మొదటిసారి సిగరెట్ కాల్చాను. 10 వ తరగతి హాలిడేస్ లో మొదటిసారి మా ఫ్రెండ్స్ తో కలసి బీర్ టేస్ట్ చేశాను. ఆ ఏజ్ లో సిగరెట్ పొగ వదులుతున్నప్పుడు, బీర్ బాటిల్ ని చేతిలో పట్టుకొని తాగుతున్నప్పుడు నాకు చాలా హై అనిపించేది. హీరో లాగా ఫీల్ అయ్యేవాడిని. నేను ఎవర్ని చూసి నేర్చుకున్నాను, ఎందుకు అంత హై ఫీల్ వచ్చేది అనే విషయం నాకు అర్థం అయ్యేది కాదు. బహుశా ఆ ఏజ్ అంత చిత్రమైనది అనుకుంటాను. నువ్వు చేస్తున్న రిసెర్చ్ గురుంచి, అలాగే నువ్వు ఆ పిల్లలని అడుగుతున్న ప్రశ్నలు ,వాళ్ళు చెప్పే సమాధానాలు, మనం రోజూ వాటి గురుంచి మాట్లాడుకోవడం….ఇవన్నీ ఆ ఏజ్ లో ఉన్న నన్ను నేను identify చేసుకోవడానికి చాలా హెల్ప్ అయ్యాయి…ఇంకా” అని చెప్పబోతూ ఉండగా… రోడ్డు పక్కన చెత్త కుప్ప కనపడేసరికి, బైక్ ఆపి ఆ బాటిల్స్ ని చెత్తకుప్ప లోకి విసిరేశాడు ప్రణయ్. గాయత్రి కూడా అతను చెప్పిన మాటల ద్వారా టీనేజ్ లో అతని మనస్సు పడిన గందరగోళాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించసాగింది. అలాగే రాము మీద, ఇంటి ఎదురుగా వుండి రోజూ అతన్ని చూస్తున్న సంజయ్ మీద ప్రణయ్ కి ఉన్న concern గురుంచి తలుచుకోగానే ప్రణయ్ మీద గౌరవం పెరిగింది గాయత్రికి.


బస్టాండుకి చేరుకున్నారు ఇద్దరూ. ప్రణయ్ ఒక చిన్నపాటి నవ్వుతో “ఇంకా…నీకో ఒక విషయం చెప్పాలి” అన్నాడు. అతని నవ్వుని, చెంపపై పడ్డ డింపుల్ ని చూస్తూ “ ఏమిటి ?” అంది. “ఈ వారం రోజులు, నేను ఒక్క రాత్రి కూడా బీర్ తాగలేదు తెలుసా!!. ప్రతిరోజూ బాటిల్ పట్టుకొని కూర్చొంటాను. నువ్వు చెప్పిన కథ వింటాను…తర్వాత ఆ కథ గురించి నీతో మాట్లాడుతాను. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ గురుంచి మాత్రమె ఆలోచిస్తూ నిద్రపోతాను……..” అని, తను చివర్లో చెప్పిన మాట అలా సడెన్ గా బయటకి రావడంతో ఒక్కసారిగా మాట్లాడటం ఆపేశాడు. ఏదో నిశ్శబ్దం ఆవరించినట్లు ఒక్క మాట కూడా బైటికి రావడం లేదు అతనికి. తర్వాత ఏమీ మాట్లాడుకోలేదు ఇద్దరూ. బస్సు ఎక్కి తన సీట్ లో కూర్చింది గాయత్రి. తన ఫోన్ కోసం హ్యాండ్ బ్యాగ్ లో వెతుకుతూ వుంటే ఆమెకి ఒక చిన్న బాక్స్ కనపడింది. ఆ బాక్స్ ని ఓపెన్ చేసి చూసింది.
***************. ****************
ప్రణయ్ తన బైక్ పై కూర్చొని బస్సులో ఉన్న గాయత్రి వైపు చూశాడు. పైన ఆకాశంలోని చందమామ కాంతి వల్లనో లేక గాయత్రి ముఖం లోని చిరునవ్వు వల్లనో తెలియదు కాని ఆమె పెట్టుకున్న కొత్త ముక్కెర లోని వజ్రపు మెరుపు అతని కళ్ళలో కనపడింది.

7 replies on “బీర్ బాటిల్స్”

Superb one one. Really was eagerly reading for the next thing that will happen. What was that gift in small box anna? Was it nose ring?

Like

Anna, you made my face end up with Questions….no signs of part two here, can we expect a part 2 of this story??? I would love to read the remaining….my baby also loved listening to this story.

Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s