నేషనల్ బుక్ ట్రస్ట్ ( నే. బు. ట్ర) పబ్లిష్ చేసిన “విషకన్య” అనే మళయాళ అనువాద నవల గురించి ఇప్పుడు రాయబోతున్నాను. ఈ నవలలో విషకన్య అంటే ప్రకృతి . ఎస్. కె. పోట్టెక్కాట్ రచయిత. పి. వి. నరసారెడ్డి తెలుగులో అనువాదం చేశారు. భాషా రాష్ట్రాలుగా విభజించక ముందు కేరళ మూడు భాగాలుగా ఉండేది. తిరువాన్కూరు, కొచ్చిన్ మరియు మలబారు. ఈ నవలలో ఉండే కాలం మన దేశానికి స్వాతంత్ర్యం రాబోయే కొన్ని సంవత్సరాల ముందు జరిగింది. తిరువాన్కూరు ప్రాంతం లో నివసిస్తున్న పేద క్రిస్టియన్లు తమ తోటలని, కయ్యలని అమ్మేసి దూరంగా ఉండే మలబార్ చేరి అక్కడి కొండ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకుంటారు. ఆ కొండలని వ్యవసాయ భూములుగా మార్చి బాగా సంపాదించాలి అనుకుంటారు. వాళ్ళ దగ్గర వున్న డబ్బులతో, చౌక ధర అని కొన్ని వందల ఎకరాల కొండ భూమిని కొంటారు.
రచయిత మలబార్ ప్రాంతం, అక్కడి ప్రజల జీవన విధానం గురించి ఎక్కువగా వివరించడం వలన ఇందులో ఉండే పాత్రల యొక్క వివరణ చాలా తక్కువగా ఉంటుంది. వర్కీ, మార్టిన్, ఆంథోనీ, అనికుట్టి, మాధవి, మరియమ్మ, పాల్, చెరియన్, కిటావు, కుంజీకృష్ణన్, వరీతకుంజీ…ఇలా ఒక ముప్పై మంది పేర్లు వస్తూ , పోతూ ఉంటాయి. కావున ఇందులో నవల చివరి వరకూ వుండే రెండు కథల గురించి రాస్తున్నాను.
1వ కథ : మార్టిన్ తన భార్య మరియమ్మ, మరియు పిల్లలతో కలిసి తిరువాన్కూరు నుండి మలబారు చేరి అక్కడ 200 ఎకరాలు కొంటారు. కొండల్ని దున్ని ,సాగు చేయడం చాలా కష్టం. మార్టిన్ కి పని చేయాలి అంటే బద్ధకం. అతను ఒక పని దొంగ. అక్కడ పని చేయడానికి మనుషుల కొరత కూడా ఉంటుంది. వర్షాకాలం వచ్చేసరికి మరియమ్మ ఒక్కటే కష్టపడి కేవలం 20 ఎకరాలు సాగు చేయగలుగుతుంది. ఆ పంటని కూడా అడవి పందులు నాశనం చేస్తాయి. అప్పటికే మలబార్ ప్రాంతం మొత్తం మలేరియా వ్యాధి వ్యాపించి ఉంటుంది. సరైన వైద్యం దొరక్క ఆ ప్రాంతంలోని పేదవాళ్లు తమ కుటుంబ సభ్యులను కోల్పోతారు. మరియమ్మ, ఆమె కూతురు కూడా మలేరియాతోనే మరణిస్తారు. చివరగా మార్టిన్ తన మూడేళ్ల కొడుకుని అక్కడే చర్చిలో వదిలిపెట్టి ఆంథోనీతో పాటు వరీతకుంజీ కి గల మైసూర్ లోని హోటల్ లో పనిచేయడానికి బయలుదేరతాడు.
2వ కథ: ఆంథోనీకి చిన్నప్పటి నుంచీ చర్చిలో పాస్టర్ అవ్వాలని ఉంటుంది. అందుకోసం బైబిల్ నియమాల్ని మరియు బ్రహ్మచర్యం పాటిస్తూ ఉంటాడు. కానీ మాధవి అతన్ని ప్రేమిస్తుంది. ఆంథోనీ మాధవితో దూరంగానే ఉంటాడు. కానీ ఒక సమయంలో ఆమెతో సంభోగంలో పాల్గొనవలసి వస్తుంది. ఆ తర్వాత ఆంథోనీ కి ఎంతో ఇష్టమైన అనికుట్టి అనే అమాయకపుపిల్ల మరణిస్తుంది. మాధవితో చేసిన తప్పే దీనికి కారణం అని అతను భావిస్తాడు. తర్వాత ఒకరోజు రాత్రి ఆంథోనీ లేని సమయంలో అతని ఇంటికి వచ్చిన మాధవిని వర్కీ పొందాలి అని ప్రయత్నించి ఆమె చేతిలో మరణిస్తాడు. ఎవ్వరూ లేని ఆంథోనీని చిన్నప్పటి నుంచి పెంచిన అతని బాబాయి చెరియన్ దొంగ వ్యాపారం చేస్తూ పోలీసులకి చిక్కుతాడు. ఇంక వీటి నుంచి దూరంగా వెళ్లాలని ప్రయత్నించిన ఆంథోనీ మైసూర్ హోటల్ లో పనిచేయడానికి ఒప్పుకుంటాడు.
చెరియన్, మార్టిన్ లాగే చాలా కుటుంబాలు తిరువాన్కూరు నుండి మలబార్ కి వలస వస్తాయి. అడవి జంతువులు పొలాల్ని నాశనం చేస్తాయి. మలేరియా సోకి ప్రాణాలు పోగొట్టుకుంటారు. పేదరికం వలన కొంతమంది చట్ట వ్యతిరేక పనులు చేసి జైలుకి వెళతారు. ఇలా ఇక్కడి ప్రకృతితో తలపడి… ఓడిపోయి చివరికి తిరువాన్కూరు వెళ్ళడానికి ప్రయాణ ఖర్చుల కోసం వాళ్ళు కొన్న వందల ఎకరాలని అక్కడి జమీందార్ నిర్ణయించిన ధరకి అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
మరో ఉపకథ ఏమిటంటే, పాల్ అనే వ్యక్తి చేతికి ఉంగరాలు, బంగారు వాచ్ మరియు ఆరు వేల రూపాయల డబ్బుతో తో మలబార్ కి వస్తాడు. 3 వేలకు వందల ఎకరాల భూమిని కొంటాడు. 5 వేలు వ్యవసాయం మీద ఖర్చు చేస్తాడు. కానీ పంట చేతికి వచ్చేసరికి అతని ఆరోగ్యం మలేరియా వలన క్షీణిస్తుంది. ఎంతో కళ గా వచ్చిన తను చివరికి తన పొలం మొత్తాన్ని ప్రయాణ ఖర్చుల కోసం ౩౦౦ రూపాయలకి జమీందారు కి అమ్మి తిరువాన్కూరు కి ప్రయాణం అవుతాడు.
ఒక వైపు ప్రకృతి తన సహజ సౌందర్యం తో ప్రజలని ఆకర్షించి మరో వైపు తన కౌగిట బంధించి హతమారుస్తుంది. మాధవి ద్వారా రచయిత ఈ స్వభావాన్ని మనకి చెప్తారు. ఆంథోనీ అక్కడి ప్రకృతిని మరియు మాధవిని తన మనసులో ఒక “విషకన్య” తో పోల్చుకుంటూ ఆ మలబార్ అడవుల్ని వదిలిపెట్టడం తో ఈ నవల ముగిస్తుంది.