అధ్యాయం -2
23W
నేను దిగవలసిన స్టాప్ వచ్చింది. పైన పెట్టిన లగేజి తీసుకొని నడుస్తూ 20 సీట్ వైపు చూశాను. తను నిద్రపోతూ వున్నాడు. రాత్రి తను రిజైన్ చేయడం,జాబ్ మారడం గురించి ఫోన్ లో తన ఫ్రెండ్ తో అరుస్తూ మాట్లాడాడు. ఆ తర్వాత కూడా ఫోన్ చూస్తూ కూర్చొన్నాడు తప్పితే …తొందరగా నిద్రపోలేదు. ఇప్పుడు కండక్టర్ వేసిన లైట్ల వలన మెలకువ వస్తుంది అనుకున్నా, కానీ తను మంచి నిద్రలో ఉన్నట్టు అనిపిస్తోంది.
తెలిసిన వ్యక్తికి చెప్పకుండా వెళుతున్నట్లుగా ఉంది…నాకు. ఫుట్ బోర్డ్ దగ్గర మళ్ళీ తన సీట్ వైపు చూశాను. తన కళ్ళు ఇంకా మూసుకునే ఉన్నాయి. నేను వెళుతున్నట్టు తనకు తెలియదన్న దిగులుతోనే దిగేశాను.
నాన్న నాకోసం స్టాప్ దగ్గర వెయిట్ చేస్తూ వున్నాడు. నాన్న బైక్ లో ఇంటికి చేరాను. బైక్ సౌండ్ విని ఇంట్లో వున్న దివ్య లగేజీ తీసుకోవడానికి గేట్ దగ్గరికి వచ్చింది.అమ్మ పూజలో బిజీగా వున్నట్లు వుంది.
“ఏం అక్కా… ముఖం చాలా డల్ గా వుంది. బస్సులో నిద్ర రాలేదా?“ అని దివ్య అడిగింది.
“సీటర్ కదా!సరిగా నిద్రపట్టలేదు” అనే సరికి..
“ముందుగానే బుక్ చేసుకుంటే స్లీపర్ లోనే దొరికేవి…లాస్ట్ మినిట్ లో చేసుకుంటే ఇలాగే రావాలి” అని నాన్న… నేను ఎప్పుడూ ఇలాగే చేస్తానని అర్థం వచ్చేలా అన్నారు.
స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అమ్మ హారతి ఇస్తూ వుంది. తనకి దేవుని మీద చాలా నమ్మకం. ఎటువంటి కష్టాలైనా , బాధలైనా దేవుడు తీర్చగలడని …చాలా చిన్న వయసు నుంచే పూజలు చేయడం అలవాటు చేసుకుంది. కానీ తన కూతుళ్లయిన మా ఇద్దరికీ మాత్రం తన లాగా పూజలు చేసే అలవాటు రాలేదు. అమ్మ టిఫిన్ పూరీలు చేసింది. నాకు మాములుగా దోశలు అంటే చాలా ఇష్టం. కానీ ఈ రోజు బైక్ లో వస్తున్నప్పుడు టిఫిన్ బండి దగ్గర పూరీలు చూసి… తినాలి అనిపించింది. నాకు ఇష్టమని, వచ్చిన ప్రతిసారీ మంచి దోశలు వేసే అమ్మ, ఈ రోజు పూరీలు చేసేసరికి “నా మనసులో అనుకుంది, తనకు ఎలా తెలిసిందా?” అనిపించింది. కానీ బయటికి చెప్పలేదు. నా ఇష్టాయిష్టాల గురించి తనకి తెలిసినంతగా వేరే ఎవరికీ తెలియదు . అందుకే రాహుల్ గురించి, అతనితో బ్రేక్ అప్ గురించి కేవలం అమ్మకి మాత్రమే చెప్పాను.
దివ్య నాకు దగ్గరగా కూర్చొని తన మొబైల్ లో చూసుకుంటూ “ నేను అన్ని ఫోటోలు పెట్టాను ఇన్స్టా గ్రామ్ లో. కనీసం ఒక్కటైనా చూశావా నువ్వు?. ఒక్క లైక్ కూడా చేయలేదు” అని అడిగే సరికి నేను నవ్వుతూ “ టిఫిన్ చేసిన వెంటనే, నువ్వు పెట్టిన ప్రతి ఫోటోకి లైక్ కొడతాను” అన్నాను… దానికి తను “అడిగి లైక్ లు కొట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు” అంది. తర్వాత అమ్మ, నేను దివ్య ముగ్గురం కూర్చొని చాలా సేపు మాట్లాడుకుంటూనే ఉన్నాం. తర్వాత అమ్మ , మధ్యాహ్నం భోజనం ప్రిపేర్ చేయడానికి కిచెన్ లోకి వెళ్ళింది. కొద్దిసేపు నేను కూడా తనకి వంటలో సహాయం చేశాను.
తర్వాత దివ్య టీవీ పెట్టుకొని మ్యూజిక్ చానెల్ లో పాటలు చూస్తూ కూర్చొంది. బయటకు వెళ్ళిన నాన్న వచ్చేసరికి అమ్మ అందరినీ భోజనాలకి పిలిచింది.నేను కూడా ఆ పాటలు చూస్తూ భోజనానికి కూర్చొన్నాను. ఇప్పుడు వస్తున్న పాటలో లిరిక్స్ , సాహిత్యం బాగానే ఉన్నాయి. కానీ ఆ హీరో యే…హీరోయిన్ శరీరాన్ని ఎక్కడ పడితే అక్కడ తాకుతున్నాడు. పట్టుకొని నొక్కుతున్నాడు. అది ఒక రొమాంటిక్ సాంగ్ అన్న ఫీలింగే కలగలేదు. ఎందుకో ఇటువంటి పాటలు అస్సలు చూడబుద్ది కాదు నాకు. తినేటప్పుడు అయితే, మరీ కష్టం. కడుపులో దేవినట్టు అనిపిస్తుంది. అందుకే నేను సినిమా పాటలు వింటాను తప్పితే, వాటి వీడియో లు అస్సలు చూడను. ఎక్కువ సేపు ఆ పాటను చూడబుద్ధి కాక పక్కనున్న రిమోట్ తీసుకొని టీవీని ఆఫ్ చేశాను.
దివ్య నా వైపు కోపం చూస్తూ
“ఎంత మంచి రొమాంటిక్ సాంగ్ అది. నాకు చాలా ఇష్టం… అయినా, అందరూ చూస్తున్నపుడు , నీకు టీవీ ఆఫ్ చేయాలని ఎలా అనిపిస్తుంది?” అని నా చేతిలో వున్న రిమోట్ తీసుకోవడానికి ప్రయత్నించింది. కానీ అది కుదరలేదు. పక్కనే వున్న తన ఫోను తీసుకొని యూట్యూబ్ లో అదే పాట పెట్టి నా వైపు కనుబొమ్మలు ఎగరేస్తూ చూసింది.
మా ఇద్దర్ని గమనిస్తున్న నాన్న నాతో..
“చెల్లెలుతో ఇంకెన్ని రోజులు గొడవపడతావు. ఈ ఇయర్ పెళ్లి చేసుకుంటే ఇవన్నీ కుదరవులే “ అని నా పెళ్లి కోసం తను చేస్తున్న ప్రయత్నాల గురించి చెప్పాలనుకున్నాడు. నేను ఏమి మాట్లాడకపోయే సరికి మళ్ళీ తనే “ ఈ సంవత్సరం అయినా ఒకే చెప్తావా ? లేక.. ఇంకా ఆలోచించాలి అంటావా?” అని కాస్త సీరియస్ గానే అడిగాడు.
నా నుంచి ఎటువంటి సమాధానం రాలేదు.
“నువ్వు … ఎవరి మాట విన్నావు కనుక” అని కోపంతో గబగబా తింటున్నాడు నాన్న.
“ఏంటండీ మీరు..కాస్త నిదానంగా తినండి” అని నాన్నకి సర్దిచెప్పబోయింది అమ్మ . నాన్న అమ్మవైపు కోపంగా చూశాడు. “మీరు కోపంగా ఉంటే జరిగిపోతోందా పెళ్ళి? దానికి నచ్చినప్పుడే చేయడం మంచిది. మీరు కంగారుపడి తనను ఇంకా ఇబ్బంది పెట్టొద్దు” అని నా తరపున మాట్లాడింది. ఏ విషయంలోనైనా ఆమ్మ నాకు సపోర్ట్ గానే మాట్లాడుతుంది. నాకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా చూస్తుంది. అలాగే ,నా కోసం నాన్నకి వ్యతిరేకంగా మాట్లాడటానికైనా భయపడదు.
అమ్మా, నాన్న ఇద్దరూ నా పెళ్లి విషయం గురించి గొడవ పడుతున్నారు.. నేను ఊరికే కూర్చొన్నాను తప్పితే, ఏమీ మాట్లాడలేదు… దివ్యమో, నా వల్లే గొడవ జరుగుతున్నా .. నేను మౌనంగా… ఏమీ పట్టనట్టు వుండటం వలన…నా వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. నేను ఇంటికి వచ్చిన ప్రతిసారీ ఇటువంటివి సాధారణం అయిపోయాయి.
సాయంత్రం బయట వరండాలో కూర్చొని పాటలు వింటున్నాను. ఆ 20 సీట్ అబ్బాయి గురించి ఆలోచన మరీ ఎక్కువైంది. అసలు ఉదయం నుంచి తన ఆలోచనలు వస్తూ …పోతూ …ఉన్నాయి..కానీ ఇంత దీర్ఘం గా , ధృఢంగా లేవు. అతను దిగవలసిన స్టాప్ లోనే దిగాడా?? లేక అలాగే నిద్రపోయి, తర్వాత స్టాప్ లో దిగాడా? …ఆ పోస్టును ఎందుకు అంత తదేకంగా చూస్తూ వున్నాడు?… అతనికి ఎందుకు అంత నిలకడ లేని మనస్తత్వం?… నిజంగానే జాబ్ రిజైన్ చేస్తున్నాడా??… ఇలా ఎంతసేపు ఆలోచించినా… నాకు ఎలాంటి సమాధానాలు దొరకవని తెలుసు. కానీ…ఇంట్లో అంతసేపు గొడవ జరుగుతున్నా…పెద్దగా పట్టించుకోని నేను, కనీసం పేరు కూడా తెలియని అతని కోసం ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నానో అర్థం కాలేదు.
*********.** *************
20
కండక్టర్ నేను దిగవలసిన స్టాప్ పేరు అరుస్తూ వుంటే, సడెన్ గా మెలకువ వచ్చింది. బస్సు ఇప్పుడే టౌన్లోకి ఎంటర్ అవుతూ వుంది. ఇంకా ఐదు నిమిషాలు పడుతుంది దిగడానికి. 23W సీట్ వైపు చూశాను. తను లేదు అక్కడ. “నాకు చెప్పకుండా వెళ్ళిపోయిందా?”అనిపించింది… కాస్త బాధ కూడా కలిగింది, తనకు నాకు యే పరిచయం లేకుండానే…
బస్సు దిగేసరికి నా కోసం అరుణ్ వెయిట్ చేస్తూ వున్నాడు. ఇంటికి వెళ్ళే దారిలో, నాన్న పొలం పని మీద ఊరికెల్లాడని చెప్పాడు. నేను పళ్ళు తోముకొని… టిఫిన్ చేసి… ప్రశాంతంగా బెడ్ రూమ్ లోకి వెళ్లి నిద్రపోయాను. రాత్రి సరిగా నిద్ర లేదు కాబట్టి… ఇప్పుడు హ్యాపీగా పట్టింది.
మధ్యాహ్నం భోజనం చేయడానికి అమ్మ నిద్ర లేపెంత వరకూ మెలకువ రాలేదు. అరుణ్ అప్పటికే టీవీలో ఏదో సినిమాని చాలా ఇంటరెస్ట్ గా చూస్తున్నాడు. తనకి సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆ ఫీల్డ్ లోకి వెళ్ళడానికి, జాబ్ కూడా మానేసి ప్రయత్నాలు చేస్తున్నాడు. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా తీశాడు. కానీ , నాన్న నుండి ఎటువంటి ఎంకరేజ్ మెంట్ లేదు…పైగా బంధువులు, తెలిసిన వాళ్ళ దగ్గర చులకన అయ్యారని తన మీద బాగా కోప్పడేవాడు. ఈ మధ్య తనతో అస్సలు మాట్లాడటం లేదు కూడా.
కానీ అరుణ్, నాన్న విషయంలో ఇవి చాలా సాధారణం అన్నట్టు… మామూలుగానే ప్రవర్తిస్తున్నాడు.
నేను మా ఇంట్లో ,బంధువుల్లో అందరి కంటే నమ్మే, ఇష్టపడే వ్యక్తి అరుణ్. తను నాకంటే పెద్ద అయినప్పటికీ నేను చెప్పే ఏ విషయమైనా చాలా ఈజీగా అర్థం చేసుకోగలడు. పూజతో విడిపోయిన సమయంలో తను భరోసా ఇవ్వకపోయి వుంటే , నా లైఫ్ ఇంకా గందరగోళం అయ్యేది. నేను రిజైన్ చేయాలనుకుంటున్న విషయం ఆల్రెడీ తనతో చెప్పాను. నీ ఇష్టం అన్నాడు…కానీ మళ్ళీ తనే ” ఇంట్లో ఇద్దరూ రిజైన్ చేసి ఖాళీగా ఉంటే, నాన్న పరిస్థితి ఎలా ఉంటుందో , ఒకసారి ఆలోచించి…ఆ తర్వాత నీకు నచ్చింది చెయ్” అని సలహా ఇచ్చాడు.
అమ్మ నాకు కూడా భోజనం తీసుకొని వచ్చింది. నేను టీవీలో ఆ సినిమా చూస్తూ… ప్లేట్ ని టేబుల్ మీద పెట్టాను. సినిమాలో రేప్ సీన్ వస్తూ వుంది. నలుగురు ఒక అమ్మాయిని కాళ్లు, చేతులు కట్టేసి ఊరికి దూరంగా ఉండే ఒక పాడుబడిన కొట్టం లోకి తీసుకెళ్లారు. ఆ అమ్మాయి ఎంత బాధపడుతున్నా, అరుస్తున్నా ఏమీ పట్టనట్టు చాలా ఘోరంగా ఆ అమ్మాయి మీద పడటానికి ప్రయత్నిస్తున్నారు.
నాకు చాలా అసహ్యంగా అనిపించింది. తినబుద్ధి కావడం లేదు. వెంటనే అరుణ్ దగ్గర రిమోట్ తీసుకొని స్క్రీన్ ని ఆఫ్ చేశాను.
అప్పుడు అరుణ్
“మంచి ఇంట్రస్టింగ్ సీన్ వస్తుంటే…” అంటూ నా వైపు అసహనంగా చూశాడు.
“అయినా ఎలా చూస్తావు ఇలాంటి సీన్లు …అది కూడా తినేటప్పుడు” అని రిమోట్ ని నా చేతిలో పట్టుకున్నాను.
“అది సినిమా …అయినా ఎవరో… ఎవర్నో రేప్ చేస్తే… నీకేంట్రా అంత బాధ?”
అంటూ నా చేతిలోని రిమోట్ తీసుకొని మళ్ళీ టీవీ ఆన్ చేశాడు.
“ ప్లీజ్ ఆఫ్ చెయ్…లేకపోతే,నాకు చాలా కోపం వస్తుంది” అని మళ్ళీ తన చేతుల్లో నుంచి రిమోట్ ని లాక్కోబోయాను..
కానీ దొరకలేదు…ఆ సీన్ చూస్తున్నప్పుడు నా కోపం ఇంకా ఎక్కువై పోయింది..
ఆ కోపంలో… ఏమీ తినకుండానే ప్లేట్లో చేతులు కడిగేసి..బయటకి వెళ్లిపోయాను..
నేను ఇంత చిన్న విషయానికి ఇలా రియాక్ట్ అవ్వడం వల్ల అమ్మ, అరుణ్ ఇద్దరూ నా వైపు విచిత్రంగా చూస్తూ ఉండిపోయారు. తర్వాత ఆ విషయం గురించి ఏదో చిన్నగా మాట్లాడుకుంటున్నారు. నాకు సరిగా వినపడలేదు.మళ్ళీ లోపలికెళ్ళి వాళ్లతో మాట్లాడటం ఇష్టం లేక బయటే చెయిర్ లో కూర్చొని మొబైల్ చూస్తూ వున్నాను. నా మొండితనం గురించి తెలిసిన అమ్మ, తిరిగి నా దగ్గరకు వచ్చి “ఏమైనా పెట్టేదా తినడానికి?” అని అడిగే ధైర్యం చేయలేకపోయింది.
సాయంత్రం అరుణ్ కాఫీ, మిర్చి బజ్జీలు తీసుకొచ్చి నాతో మాటలు కలిపాడు. మధ్యాహ్నం భోజనాల దగ్గర జరిగిన దాని గురించి ఏమీ మాట్లాడలేదు. నాకు తెలుసు, తను మళ్ళీ ఆ విషయం గురించి మాట్లాడడని. నేను వాళ్ళిద్దరి ముందు అంతలా రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సింది . కానీ ఎవరి దగ్గర నా కోపాన్ని, బాధని చూపించాలి?
అలాగే ఈ విషయం గురించి అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటే…ఆ 23W సీట్ అమ్మాయి గుర్తొచ్చింది. ఒకవేళ తను, నా పరిస్థితి లో వుంటే ఎలా ప్రవర్తిస్తుంది?…ఏమీ పట్టనట్టు,జరగనట్టు అలాగే ఉంటుందా?…లేక నాలాగే చేస్తుందా?..తన ను ఒక్కసారి అయినా కలవాలని…మాట్లాడాలని అనిపిస్తోంది…అది కుదరదు, జరగదు అని తెలిసినా కూడా!!
రాత్రి …నేను జాబ్ గురించి ఏమని ఆలోచిస్తున్నానో కనుక్కోవడానికి రవి కాల్ చేశాడు. నేను “ఖచ్చితంగా రిజైన్ చేస్తాను” అనేసరికి… ఈ సమాధానం ముందే ఊహించినవాడిలా “సరే, రిజైన్ చెయ్…కానీ, ఫస్టు వేరే జాబ్ చూసుకొని, ఆ తర్వాత రిజైన్ చెయ్…” అని చెప్పాడు…కొద్దిసేపటి తర్వాత మళ్ళీ తనే “మా ఫ్రెండ్ కి తెలిసిన వాళ్ళ కంపెనీ లో వేకెన్సీ లు వున్నాయని చెప్పారు…రిఫరెన్స్ కూడా ఇస్తారు .నీ CV ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి పంపించాను…ఆ తర్వాత ఒక కాంటాక్ట్ నెంబర్ నీకు సెండ్ చేస్తాను. ఆ జాబ్ గురించి ఒక్కసారి తనతో మాట్లాడు” అని చెప్పాడు
“చాలా థ్యాంక్స్ రా..” అన్నాను… నాకు వాడు చేస్తున్న సహాయానికి ఇది చాలా తక్కువ పదం… మళ్లీ మా మధ్య ఇలాంటి ఫార్మాలటీస్ ఏమిటి? అనిపించింది.“సరే….ముందు జాబ్ రాని, తర్వాతే రిజైన్ ..ఇంక ఈ విషయం గురుంచి ఎక్కువ ఆలోచించి బుర్ర పాడుచేసుకోకు ”అని చెప్పి ఫోను పెట్టేశాడు.
కొద్దిసేపటికి “Mahi” అనే కాంటాక్ట్ ని షేర్ చేశాడు. “ Ask clearly about interview process” అని కూడా మెసేజ్ చేశాడు.ఆ నంబర్ కి కాల్ చేద్దామనుకున్నా… కానీ అవతలి వాళ్ళు వేరే పనిలో బిజీగా ఉంటే… అయినా ఈ టైం లో ఫోన్ చేయడం అంత బాగోదని… అంతకంటే వాట్సాప్ లో మెసేజ్ చేయడం బెటరని అనిపించింది.
రవి పంపిన ఆ కాంటాక్ట్ ని అదే పేరుతో మొబైల్ లో సేవ్ చేశాను. తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసి “Mahi” అని సెర్చ్ బాక్స్ లో టైప్ చేస్తే ఒక అమ్మాయి పిక్ డిపి గా వుంది. క్యూరియాసిటీ కొద్ది ఆ డిపిని ఓపెన్ చేశాను. ఆ అమ్మాయిని చూసేసరికి నాకు ఒకింత ఆశ్చర్యం మరియు కాస్త సంతోషంగా అనిపించింది. పోగొట్టుకున్న మనిషి మళ్ళీ కనిపించినట్టుగా వుంది. అవును, మహి అంటే తనే…ఆ 23W సీట్ అమ్మాయి.
….. (ఇంకా వుంది.)
One reply on “20,23 W”
Bagundi dattu
LikeLike