Categories
Uncategorized

20, 23W

అధ్యాయం -1

23W

వీకెండ్ కాదు కాబట్టి బస్సు లో కొన్ని సీట్లు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. 20 మేల్, 5 ఫీమేల్ ప్యాసింజర్స్, ఇంకా 11 సీట్లు ఖాళీగా వున్నాయని ఇద్దరు డ్రైవర్లు మాట్లాడుకుంటున్నారు. నా టికెట్ నంబర్, సీట్ నెంబర్ డ్రైవర్ కి చెప్పి వెళ్లి నా సీట్ లో కూర్చొన్నాను. తర్వాతి స్టాప్ లో చాలా కంగారుగా , హడావిడిగా ఎక్కాడు తను. రాత్రి జర్నీ కాబట్టేమో టీ షర్ట్ , నైట్ ప్యాంట్ లో వున్నాడు. సీట్ నెంబర్ 20 లో కూర్చొన్నాడు. కూర్చొన్న తర్వాత ఒక్క నిమిషం గూడా నిమ్మళంగా లేడు. ఇప్పటికే ఒక పది సార్లు సీట్ ని ముందుకు వెనక్కి జరిపి ఉంటాడు.

కొద్దిసేపటి కి నాకు గీత నుంచి కాల్ వచ్చింది.
“జాబ్ మారొచ్చు కదా… నీకున్న నాలెడ్జి కి, ఎక్స్‌పీరియన్స్ కి బయట మంచి శాలరీ వస్తుంది. ఏడేళ్ల నుంచి ఇదే కంపెనీ లో ఉన్నావు. ఇంక మారావా?…. ఒక్కసారి ఆలోచించు. అది చాలా మంచి అవకాశం. మిస్ చేసుకోవద్దు. ప్లీజ్..” అంటూ కాల్ లిఫ్ట్ చేయగానే చెప్పసాగింది. ఇప్పటికే చాలా సార్లు మేమిద్దరం ఈ విషయం గురించి మాట్లాడుకున్నాం. ఈ ఇయర్ అప్రైజల్ వచ్చిన రోజు నుంచి అయితే తను నన్ను వదిలి పెట్టడం లేదు. తన దృష్టి లో, ఈ కంపెనీ నేను చేస్తున్న పనికి నాకు తగిన గుర్తింపును ఇవ్వడం లేదు.
“ నాకు తెలుసు గీత.. నేను ఏడేళ్ల నుంచి ఒకే కంపెనీ లో చేస్తున్నానని. కానీ నాకు ఇప్పుడు ఎక్కడికీ మారాలని లేదు. అలాగే ఏదో సాధించాలని అస్సలు లేదు. ప్లీజ్.. నన్ను ఇబ్బంది పెట్టకు” అనే సరికి “సరే మేడం, మీ ఇష్టం” అంది. ఇంక నేను మారను అనుకోని , కాస్త ఇబ్బంది గానే ఫోన్ పెట్టేసింది.

ఇప్పటికి బస్సు స్పీడు కి నా శరీరం ఎడ్జెస్ట్ అయినట్టు వుంది. మళ్ళీ ఆ 20 వైపు చూశాను. తను మొబైల్ చూస్తున్నాడు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టా గ్రామ్, వాట్స్ అప్ అన్నీ తిప్పి తిప్పి చూస్తున్నాడు. తన ని గమనించడం మానేసి …ఈ రోజు పౌర్ణమి కాబట్టి చంద్రుడు పూర్తిగా కనిపి స్తుంటే బస్సు విండో లో నుంచి చూస్తూ వున్నాను కొద్దిసేపు. తర్వాత వాటర్ తాగుదామని బాటిల్ కోసం వెతుకుతూ…. 20 సీట్ ఒక పోస్టు ని తదేకంగా చూస్తూ వుండటం ఆశ్చర్యం గా అనిపించి… ఆ పోస్టు వైపు నేను చూడసాగాను. నాకు ఆ పోస్టు సరిగా కనపడలేదు కానీ..
………..4 ………………….. 1 hour అనేవి కాస్త పెద్దగా కనిపించాయి.

ఆ నంబర్లు ,ఆ డేటా నాకు బాగా గుర్తు. ఆ పోస్టు యే విషయం గురించో నాకు అర్థం అయ్యింది. ఆ డేటా ప్రకారం ప్రతి గంటకి 4 గురు పిల్లలు బాధితులు గా మారుతున్నారు. ఆ గంట లోని ఆ నలుగురు లో నేనూ ఒకరిని.

చిన్నప్పుడు నాకు తెలియదు, నన్ను బాధితురాలు అంటారనీ. వార్తల్లో , టీవీ లో చూడటం ద్వారా నాకు నేనుగా తెలుసుకున్నాను. అలాగే ఆ వయసు లో ఈ విషయం గురించి ఎవరికీ చెప్పాలి అనిపించలేదు.ఇప్పుడు చాలా సార్లు ఎవరి తో నైనా చెప్పుకుందాం అనుకుంటే …
ఇంకా గుర్తుపెట్టుకున్నావా? అని తిరిగి అడుగుతారేమో అని బయటకి చెప్పాలన్న ఆలోచనని మానేశాను.

గీత అయితే ఎన్ని సార్లు అడిగేదో…ఎందుకు ఎప్పుడూ మౌనంగా , అలా ఏమీ పట్టనట్టు వుంటావు? అని. నిజంగా నాకూ తెలియదు, నేను ఎందుకు ఇలా వుంటున్నా నో? కనీసం ఎప్పటి నుంచి ఇలా వుండటం నేర్చుకున్నాను అంటే, అది కూడా ఖచ్చితం గా చెప్పలేను. చిన్నప్పటి నుంచి అయితే కాదు. ఆ సంఘటన జరిగినప్పటి నుంచా , లేక ఆ సంఘటన ను గుర్తు చేసుకుంటూ వుండటం వలన.. ఏమో అది కూడా సరిగ్గా తెలియదు.

ప్రేమ లో, జాబ్ లో, కుటుంబం లో ఏమి జరిగినా ..అది మంచై నా, చెడై నా అందరి లాగా మాములుగా రియాక్ట్ అవ్వడం మాత్రం నాకు చేత కావడం లేదు. రాహుల్ నన్ను చాలా విషయాల్లో సప్రయిజ్ చేయాలని ప్రయత్నించేవాడు. నా నుంచి ఒక ఆశ్చర్యాన్ని, అనుభూతి ని కోరుకునేవాడు. చివరికి నా నుంచి అవేమీ పొందలేక దూరం జరగడం మొదలుపెట్టాడు. రాహుల్ దూరం అవుతున్నప్పుడు కూడా నాకు పెద్ద బాధ అనిపించలేదు. చుట్టూ వుండేవాళ్ళు మాత్రం నా ప్రవర్తన కి ఒక్కోక్క పేరు పెట్టుకున్నారు.

నేను కూడా వీళ్ళ మాదిరిగా మాములుగా వుండాలని చాలా ప్రయత్నించాను. యోగా కి వెళ్ళడం అలవాటు చేసుకున్నాను. ఒక్క కళ్ళు మూసుకోవడం తప్పితే మిగతా ఆలోచనలన్నీ మామూలే. మ్యూజిక్ నేర్చుకోవాలని ట్రై చేశాను. చేతి వేళ్ళకి మెదడు చేసే ఆలోచనల కి మధ్య అస్సలు పొంతన కుదరక వదిలేసాను.

కేవలం ఇటువంటి వార్తలు , విషయాలు తప్పితే …ఎందుకో మిగతా చాలా విషయాలు నన్ను ఇబ్బంది పెట్టడం మానేశాయి. నేనున్న మానసిక పరిస్థితి ని సైకాలజీ లో ఏమంటారో… నాకు తెలియదు.

కానీ ఇలా వీటి గురుంచి ఆలోచిస్తూ వుంటే ఇంక ఈ రాత్రి నాకు నిద్ర పట్టే అవకాశం లేదు. వెంటనే ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకొని ప్లే లిస్టు లో మొదటే కనపడిన “నానాటి బతుకు నాటకము…” ను రిపీట్ మోడ్ లో పెట్టి కళ్ళు మూసుకున్నాను. నిద్రపోయే ముందు ఒకే పాట ని రిపీట్ మోడ్ లో పెట్టుకొని పడుకుంటాను. మ్యూజిక్ కానీ, లిరిక్స్ కానీ చేంజ్ అయితే నాకు నిద్ర పట్టదు.

20

నేను బస్సు దగ్గరికి వచ్చేటప్పటికి , నా వల్ల బస్సు ఆలస్యం అయినందుకు ఇద్దరు డ్రైవర్లు కోపంగా చూస్తున్నారు. “ ట్రాఫిక్ సర్. ఒక 5 నిమిషాలు లేట్ అయ్యింది. అంతే” అని సంజాయిషీ కూడా చెప్పాను. కానీ డ్రైవర్ మాత్రం అదే కోపం తో “టికెట్ నంబర్ చెప్పు” అని రిజర్వేషన్ నంబర్స్ వున్న పేపర్ ని తీసుకున్నాడు. నేను నంబర్ చెప్పి నా సీట్ దగ్గరకు వచ్చాను. బ్యాగ్ పైన పెట్టబోతూ నా వెనక వరస లో 23W లో కూర్చొన్న అమ్మాయిని చూశాను. తను ఇంతసేపూ నన్ను, నా హడావిడి ని గమనిస్తూ వున్నట్టు వుంది. నేను సీట్ లో కూర్చొని కంఫర్ట బుల్ ఉండటానికి సీట్ ని ముందు కి , వెనక్కి అడ్జస్ట్ చేస్తూ వున్నాను. అప్పుడే 23W కి ఫోన్ కాల్ కాల్ వచ్చింది. నేను వినొద్దు అనుకున్నా, తను ఫోను లో మాట్లాడే మాటలు చాలా స్పష్టంగా నాకు వినిపిస్తున్నాయి.

నా పక్కన 19W అమెజాన్ ప్రైం లో మలయాళం సినిమా చూస్తూ వున్నాడు. 16 ఏమో నెట్ ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ సీరీస్ ,
15W వాట్స్ అప్ లో చాట్ చేస్తూ వున్నాడు. బస్సు లో కొందరు సినిమాలు, టీవీ షో లు చూస్తున్నారు, మరి కొందరు పాటలు వింటూ నిద్రపోతున్నారు. అందరూ పద్ధతి గా పక్కవాళ్ళని డిస్ట్రబ్ చేయకూడదని ఇయర్ ఫోన్స్ పెట్టుకొన్నారు. డ్రైవర్ ఏదైనా సినిమా పెడతాడు అనుకున్నాను కానీ వాడికి పెట్టె ఆలోచన లేదని, బస్సు ఎక్కిన కొద్దిసపటికే అర్థమైంది.

తర్వాత నేను మొబైల్ తీసుకొని ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టా గ్రామ్, వాట్స్ అప్ లోని పోస్టులు, స్టేటస్ లను చూస్తూ కూర్చొన్నా. కానీ ఎక్కువ సేపు మొబైల్ చూడాలనిపించ లేదు. అందుకే మొబైల్ ను పాకెట్ లో పెట్టి కుడి వైపు కు తిరగగానే 23W లోని ఆ అమ్మాయి కిటికీ లోంచి చంద్రుని వైపు చూస్తూ వుంది. కొద్దిసేపు తన వైపే చూడాలని అనిపించింది. కానీ తను నన్ను గమనిస్తే బాగోదని కాసేపు అటూ,ఇటూ చూస్తూ కూర్చున్నాను. ఇవన్నీ కుదరక మళ్ళీ మొబైల్ తీసుకొన్నాను. అప్పుడే నా B.tech ఫ్రెండ్ షేర్ చేసిన “Indian Sexual abuse : 4 children victims in every 1 hour” అన్న పోస్టు ఫేస్ బుక్ లో కనపడింది. మొత్తం చదవక పోయినా ఆ పోస్టు లో ఏయే విషయాలు వుంటాయో నాకు బాగా తెలుసు.

ఆ పోస్టు చూడగానే , ఆ బాధితుల లో నేనూ ఒకడిని కాబట్టేమో….. సడెన్ గా నా హార్ట్ బీట్ పెరిగినట్టు అనిపించింది. ఈ విషయం గురించిన న్యూస్ గానీ ,పోస్టు గానీ చూసినప్పుడు కొన్ని సార్లు ఏమీ పట్టనట్టు వుండేవాడిని ,కొన్ని సార్లు అయితే హార్ట్ బీట్ పెరిగేది, కొన్ని సార్లు బాగా తగ్గేది. ఇప్పుడు మాత్రం నా చేతి ,కాలి వేళ్ళని వేగంగా తిప్పుతూ… నా రెండు కాళ్ళ ని అటూ ఇటూ షేక్ చేస్తూ నన్నునేను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ వున్నాను.నాకు ఇప్పుడు లేచి నడవాలి , పరిగెత్తాలి అనిపిస్తోంది..ఈ ఎమోషన్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా వుంది.

సాంగ్స్ వింటే కాస్త బెటరేమో అని, బ్లూటూత్ ఆన్ చేసి ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేశాను. ఇలాంటి సమయాల్లో మెలోడీ లు నన్ను ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడతాయి. అందుకే ఫాస్ట్ బీట్స్ వున్న ప్లే లిస్టు ని ఆన్ చేశాను. ఫుల్ వాల్యూం పెట్టుకున్నా. మ్యూజిక్ లో కానీ , లిరిక్ లో కానీ కాస్త వేగం తగ్గినా పాట చేంజ్ చేస్తున్నాను. అలా ఒక పది నిమిషాలు విన్నాక ఇప్పుడు కాస్త ప్రశాంతంగా వున్నట్టు వుంది.

అప్పుడే రవి నుంచి కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేయగానే
“రేయ్ పనికి మాలిన ఎదవా..” అంటూ వాడు స్టార్ట్ చేశాడు.
“నీ బతుక్కి జాబ్ లో చేరినప్పటి నుండి ఒక్క పనైనా సక్కగా కంప్లీట్ చేసినవా? మళ్ళీ ఏమైనా అంటే పౌరుషం ఒకటి… ఊరికే మేనేజర్ మీద మొరగడం కాదు. చెప్పేది వినడం నేర్చుకో… అప్రైజల్ లో నీకు ఇచ్చిన రేటింగ్ చాలా ఎక్కువ…. రిజైన్ లెటర్ పెట్టావో, చెప్పు ఇరుగుతుంది” అని వాడు ఆవేశంగా చెప్తూ వున్నాడు. నేను సైలెంట్ గా వింటున్నాను . తర్వాత వాడే “ఇప్పుడు నీకున్న నాలెడ్జ్ కి బయటకి వెళ్లి జాబ్ వెతుక్కోవడం చాలా కష్టం. తెలిసిన వాళ్ళు వున్నారు కాబట్టి ఎలాగోలా నాలుగు కంపెనీలు మారావు..” అని నా గురించి నాకే చెప్పబోయాడు. కానీ నేను తగ్గే రకం కాదు.
“నాలుగు కాకపోతే నలభై మారతాను. ఎవ్వరూ ఇవ్వకపోతే ఏదో ఒక చిన్న బిజినెస్ చేసుకునైనా బతుకుతాను కానీ ,ఆ వెధవ కింద పని చేసేది లేదు” అని కాల్ కట్ చేయబోయాను..
“అంత బలుపు పనికి రాదు రొయ్..” అంటూ ఏదో చెప్పబోయాడు. కానీ వాడితో వాదించడం ఇష్టం లేక కాల్ కట్ చేశాను.

మళ్ళీ కుడి వైపు తిరిగి 23W ని చూస్తున్నాను. తను చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చాలా అందంగా ,ప్రశాంతం గా నిద్ర పోతూ వుంది. ఏడేళ్లు గా ఒకే కంపెనీ లోనే వుంది అంటే, ఎంత నిలకడ గల మనిషి. కానీ నేను అలా కాదు. నా గురించి రవి చెప్పేది కరక్టే. కానీ నేను ఒప్పుకోను అంతే.

కొన్ని సార్లు నా ప్రవర్తన మీద నాకే చిరాకు వచ్చేది. నిలకడ గా ఉండలేను. అలాగని ఏదీ ఈజీగా తీసుకోలేను. పూజ కు నా ప్రవర్తన మరీ వింతగా అనిపించేది. నాతో బయట తిరగాలని, మాట్లాడాలని చాలా ఆశపడేది. కానీ నాకేమో ప్రతి చిన్న విషయానికి వంద ఆలోచనలు, వేయి సమాధానాలు. ఒకే చోట కుదురుగా కాసేపు కూడా వుండలేని మనస్తత్వం. పాపం… నా ప్రవర్తన కి విసుగు చెంది, నాతో జీవితంలో మాట్లాడకూడదని నెంబర్ ని కూడా బ్లాక్ చేసింది. ఒక పుస్తకం లో ఎక్కడో “ మానసిక దౌర్భల్యం” అన్న పదాన్ని చదివి.. నాకూ కూడా అదే వుందని అనుకునేవాడిని.

జిమ్ కి వెళితే స్ట్రాంగ్ అవ్వొచ్చు అని వెళ్ళడం స్టార్ట్ చేశాను. బాడీ అయినంత స్ట్రాంగ్ గా బుద్ధి కాలేదు. డ్యాన్స్ ట్రై చేశాను. బాడీ కంటే మనసు లోని ఆలోచనలు ఇంకా ఫాస్ట్ గా తిరుగుతూ ఉండేవి. కుదరక వదిలేసాను.

ఇలాగే ఆలోచిస్తూ….ఆలోచిస్తూ…. వాచ్ వైపు చూసుకుంటే టైం 2 గంటలు. ఈ రాత్రికి నిద్రపోతే చాలు,ఉదయాన్నే ఈ ఆలోచలేవీ గుర్తుకురావు అనుకొని…. సీట్ ని కాస్త వెనక్కు జరిపి కళ్ళు మూసుకున్నాను.
***************. *************

…ఇంకా ఉంది

12 replies on “20, 23W”

It’s really nice story Dattu.All the best for ur bright future.prathi line lo story kallaku kattinatlu explain chesaavu.chaala bavundi

Like

Super Brother chala rojula tharvatha ilanti rachana ni chesanu Meru ilage continue cheyandi chala etthuku edugutharu

Like

Nice concept while we read this story evn we connect to itself if it would have continue it would have been nice bt excellent keep it up keep gng all the best

Like

Leave a comment