Categories
Uncategorized

డ్రాపవుట్

తమ బట్టలన్నీ బ్యాగ్ లో సర్దుతూ వుంది సుజాత.
ఇంకో మూలన సిద్దన్న బీడీ తాగుతూ నేల మీద కూర్చొని ఉన్నాడు.

బయట సిద్దన్న తల్లి వీరమ్మ అరుగు మీద కూర్చొని వక్కలు దంచుతూ వుంది.
వీరమ్మకి ఎదురుగా సిద్దన్న కొడుకు పదేళ్ళ అంజి టైరుతో ఆడుకుంటూ ఉన్నాడు.
“ఇంకా తేమల్లెదే నీది?” అంటూ సిద్దన్న సుజాత ను గదమాయించాడు.

.“నువ్వేమో బీడీ తాగాతా ఉండావు గాని, నాకేమైనా సాయం చేస్తా వుండావా?… మళ్ళా అజమాయిషీ ఒకటి. మీ అమ్మకి చెప్పు ఇంటిని జాగ్రత్తగా చూడమని. పోయినసారి వచ్చేసరికి ఇల్లు ఎంత గలీజుగా పెట్టిందో!!!… మా తల్లి. ఒక్క పూట కూడా అలికినట్టు లేదు. దానికే … పాపం మన అంజి గాడికి జరం ఫుల్లుగా వచ్చింది…..వాంతులు,బేదులు….. బిడ్డ సగం అయిపోయినాడు.” అంటూ సుజాత అత్త మీద తనకున్న ఆక్రోశాన్ని వెళ్లగక్కింది.
“అందుకే గదనే, ఈ తూరి అంజి గాడిని కూడా మనతో పాటు తీస్కబోయేది.” అని సిద్దన్న గుమ్మం వైపు చూస్తూ కాస్త గట్టిగా అన్నాడు.
తండ్రి చెప్పిన మాటలు వినగానే అంజి గాడి మొహం సంతోషం తో నిండిపోయింది. ఆడుకుంటున్న టైరు వదిలేసి గుమ్మానికి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు.
వీరమ్మ మాత్రం ఈ విషయం ముందే తెలిసిందానిలా ఒక నిట్టూర్పు విడిచింది..

“అంజిగా ! ఇట్రా రా” అంటూ సిద్దన్న ఏదో గుర్తొచ్చిన వాడిలా పిలిచాడు.
“ ఏం నాయినా!!” అంటూ అంజి గుమ్మం దగ్గర నుంచి లోపలికి వచ్చాడు
.“రమణమ్మ అంగడికి పోయి రెండు బీడీ కట్టలు తీసుకొని రాపోరా!” అంటూ అంజి చేతిలో నోటు పెట్టినాడు సిద్దన్న.
అది చూసి సుజాత కోపం తో సిద్దన్న నీ …అతను తాగుతున్న బీడీ నీ చూస్తూ ఉండిపోయింది.
“సరే నాయనా!” అంటూ అంజి నోటుని జేబులో పెట్టుకొని వెళ్ళిపోయాడు.

*********************************

అంజి ఇన్ని రోజులు జేజి తో కలసి ఊర్లోనే ఉన్నాడు.. అమ్మానాయనా మూడు నెలలకో ,,నాలుగు నెలలకో ఒకసారి వచ్చి చూసేవారు.. కానీ ఈ రోజు అంజి యే వాళ్ళ తో కలసి బెంగుళూరు కి పోతున్నాడు.. అక్కడ వాళ్ళు పనిచేసే బిల్డింగ్ దగ్గర… వాళ్ళతో పాటు కలసి వుండబోతున్నాడు!!!… అంజి కి భలే సంతోషంగా వుంది ఇప్పుడు..
అంతే కాదు వాడి సంతోషానికి ఇంకో ముఖ్య కారణం..రేపటి నుంచి స్కూలుకి పోయే పని కూడా లేదు..నోటు బుక్కు లు రాసే పని,చదివే పని అస్సలే లేదు.. రోజంతా వాడికి నచ్చిన ఆటలన్నీ ఆడుకోవచ్చు.. ఇలా అంజి ఆలోచనలన్నీ బెంగుళూరు మీదనే వుండిపోయాయి..

అంజి వాళ్ళ ఇంటి సందు మలుపు తిరిగి వేరే వీధి లోకి వచ్చాడు…ఆ వీధిలోనే తను చదివే గవర్నమెంట్ స్కూలు వుంది…ఆ వీధిలో కొద్ది దూరం నడవగానే వాడికి దేశ నాయకుల పెయింటింగ్స్ వున్న స్కూలు గోడలు కనిపించాయి…ఆ గోడలు చూడగానే
అంతవరకూ ఉత్సాహంగా వున్న వాడి నడక వేగం ఒక్క సారిగా తగ్గిపోయింది.
***************************
అది స్కూలు ప్రారంభమయ్యే సమయం. పిల్లలందరూ స్కూలు దగ్గరే తిరుగుతున్నారు. అంతలోనే తన తరగతి అమ్మాయిలు సుధ,జానకి అటు వైపు గా రావడం గమనించాడు అంజి…
సుధ అంజికి దగ్గరగా వచ్చి
“అంజి.. నువ్వేమీ ఇంకా బ్యాగు తాలేదు. కొద్దిసేపుంటే గంట కొడతారు. ప్రేయర్ స్టార్ట్ అయిపోతుంది. నీకు తెలుసుగా! లేట్ గా వస్తే చంద్రం సారూ ఎట్లా కొడతాడో” అని చెప్పింది.

దానికి అంజి “మా నాయిన బీడిలు తెమ్మన్నాడు… తేవడానికి పోతున్నా” అని గొంతులో ఒక విధమైన నిర్లక్ష్యంతో సమాధానం చెప్పాడు..
దానికి సుధ,జానకి ఒకేసారి
“ సరే తొందరగా రా.. లేదంటే సార్ చేతిలో నీకు దెబ్బలే..” అంటూ చంద్రం సారు తరపున ఒక వార్నింగ్ ఇచ్చామనుకొని హడావిడిగా స్కూలు లోపలికి పరిగెత్తారు .
“ అసలు ఇంక స్కూలు కి వస్తే నే కదా చంద్రం సారు తో దెబ్బలు తినేది!!!!…..” పరిగెత్తుతున్న ఆ ఇద్దరి వైపు చూస్తూ నవ్వుకున్నాడు అంజి.

అంజి అంగడి దగ్గరకు వచ్చేసరికి అతని బెస్ట్ ఫ్రెండ్ శీను కొత్త నోట్ బుక్ చేతిలో పట్టుకొని కనబడ్డాడు.
శీను అంజి ని చూసి
“ రేయ్ అంజి.. నిన్న సారు మ్యాథ్స్ కోసం అందరినీ కొత్త నోట్ బుక్ లు కొనుక్కోమన్నాడు…. నువ్ కొనుకున్నావా?” అని అడిగాడు. అంజి, తాను బెంగుళూరు కి పోతున్నట్టు శీను కి చెప్పాలనుకున్నాడు…..కానీ ఎందుకో ఆగిపోయాడు..
“ లేదు రా.. ఇంకా కొన్లా..” అని మాత్రం అన్నాడు..
“ఇదుగో నా కొత్త బుక్కు…100 పేజీలు..చూడు” అని అంజికి ఇచ్చాడు శీను..
అప్పుడే స్కూలు గంట కొట్టాడు 5 వ తరగతి చదివే రాఘవ.
అది విని శీను “నువ్ తొందరగా రా రేయ్.. నేను పోతున్నా!! ..” అని కొద్ది దూరం వెళ్లి తల తిప్పి… ఎక్కడ అంజి గీతలు వున్న బుక్కు కొంటాడో? అని … “ సారు గీతలు లేని బుక్కు కొనమన్నాడు” అని చెప్పి చేతిలోని పుస్తకాన్ని వేలితో తిప్పుతూ వెళ్ళిపోయాడు…
స్కూలు లో ప్రేయర్ స్టార్ట్ అయ్యింది.
అంజి అంగడి లోపలికి వెళ్లి“ అక్కా ! 2 కట్టల బీడిలు ఇయ్యక్కా అని చేతిలో వున్న నోటును ఇచ్చాడు. తర్వాత బీడీ కట్టలు,మిగిలిన చిల్లర తీసుకొని తిరిగి ఇంటికి బయలు దేరాడు.
స్కూలు నుంచి ప్రేయర్ వినబడుతున్న కొద్దీ అంజికి ఆందోళన ఎక్కువయింది… ప్రతి రోజూ ఈ సమయానికి స్కూలు లోపల… ప్రేయర్ లో పిల్లలందరి తో పాటు నిలబడి వుండే తను… ఈ రోజు స్కూలు బయట వుండటం వలన ఏదో
కోల్పోతానేమో …అనే బాధ ఎక్కువవసాగింది…
***************************
క్లాస్ రూమ్ లో చంద్రం సార్ అటెండన్స్ తీసుకుంటున్నాడు.
అరుణ – ప్రసంట్ సార్
అజయ్ – ప్రసంట్ సార్
అంకమ్మ – ప్రసంట్ సార్
అంజి ….అంజి ….. అంజి ……
“ఏరా.. పిల్లలూ , వీడు ఈ రోజు కూడా రాలేదా!?”
“ ఆబ్సంట్ సార్!!… వాళ్ల నాయన వాణ్ని బెంగళూరు కి తీసుకుపోయినాడు సార్..”
“వీడు కూడా పోయినాడు…. బాగనే చదివేటోడే…… ఇంకో “డ్రాపవుటా?” … ఏం పీకుదామని బెంగళూరు పోయినాడు.
ఇంతోటి దానికి పిల్లోలను బడికి ఎందుకు పంపడం దేనికి… మాకు తలనొప్పి కాపోతే?””….
చంద్రం సార్ చికాకు పడుతున్నాడు..
***************************

అంజి భయంతో ఒక్క సారిగా కళ్ళు తెరచి చూస్తె చెట్టు కింది అరుగు మీద కూర్చొని ఉన్నాడు..
2 సంవత్సారాల క్రితం తన లాగే 3 వ తరరగతి చదివే సుబ్బలక్ష్మి బెంగళూరు కి వాళ్ళ అమ్మానాయన తో పాటు పోయినప్పుడు … మొదటిసారి చంద్రం సార్ నోటి నుండి “డ్రాపవుట్” అనే పదం విన్నాడు అంజి … మొదట్లో ఆ పదం అర్థం తెలియక పోయినా… మల్లేశ్,నవీన్,అమర్,ఖాజా….ఇలా కొంతమంది పిల్లలు స్కూలు కి రాకుండా నిలిచిపోతుంటే నూ ..ఎవరైనా అధికారులు వచ్చినపుడు వాళ్ళ మాటల్లోనూ ఈ పదం యొక్క అర్థం ఈజీగా తెలియసాగింది అంజికి…
తను కూడా రేపటి నుంచి స్కూలు లో “ డ్రాప్ అవుట్” అవుతాడు!!!..తనను అలా ఊహించుకునే సరికి అంజికి కళ్ళలో నీళ్ళు వచ్చాయి.. అలా ఏడుస్తూ కళ్ళు తుడుచుకొని పైకి లేచేసరికి… ఎదురుగా సిద్దన్న నిలబడి ఉన్నాడు..
అంజి ఎందుకు ఏడుస్తున్నాడో తెలియక సిద్ధన్న అంజి ని దగ్గరకు తీసుకుని.“ ఏమైంది అంజి.. ఎందుకు కల్లెమ్మడి నీల్లెట్టుకుంటున్నావ్…?“ఏడవబాకురా … నాతో చెప్పు… నేను ఏమీ అనను రా.. నాతో చెప్పు” …అంటూ అంజి ని బుజ్జగించసాగాడు.. అప్పుడు అంజి కళ్ళు తుడుచుకుంటూ “నేను మీతో బెంగుళూరు కి రాను. నేను స్కూలు కి పోతాను” అని సిద్దన్నని ఎత్తుకోమని చేతులు చాపాడు అంజి . సిద్ధన్న అంజిని భుజం మీద ఎక్కించుకొని “నీ ఇట్టం రా అంజి…నీ స్కూలు కి పోవాలంటే స్కూలు కి, బెంగుళూరుకి వస్తానంటే అంటే బెంగళూరు కి”…
“ నిజం….ఒట్టూ” అంటూ అంజి సిద్దన్న చేతిని పట్టుకున్నాడు ..దానికి బదులుగా సిద్దన్న అంజి చేతిలో చెయ్యి వేసి “ ఒట్టు” అని చెప్పేసరికి అంజి ముఖం నవ్వుతూ కనిపించింది సిద్ధన్న కి…. “ఈ మాత్రం దానికేనా ఇందాక అంత ఏడుపు!” అని అంజి కి సిద్ధన్న తన వేళ్ళతో చంకళ్లో, నడుము దగ్గర చక్కిలిగింతలు పెట్టేసరికి ఆ చిక్కిగింతలకు అంజి మరింత సంతోషంగా నవ్వసాగాడు …
**************************

( చాసో గారి కథ “ఎందుకు పారేస్తాను నాన్నా?” స్ఫూర్తి తో రాసిన కథ)

9 replies on “డ్రాపవుట్”

Anna…just characters running in front of my eyes..I can visually see it..greatness of ur story is…there is under current message in every story.

Like

Leave a comment