ఉదయం 10 గంటలు
బస్సు దిగాడు వరుణ్.
తను ఆలోచిస్తూ నడుస్తున్నాడు,
ఈ రోజు తను చేయబోయేది తప్పా, ఒప్పా అని…. గత 3 నెలలుగా ఆలోచిస్తూనే వున్నాడు.
16 ఏళ్ళ వయసున్న వరుణ్ కి అది చాలా పెద్ద సమస్య…. అలాగే ఇప్పుడున్న తన పరిస్థితికి ఈ విధంగా చేయడం, చాలా అవసరమని అనుకుంటున్నాడు.
రాత్రి 12:30 వరకూ సమయం వుంది. కానీ రోజంతా ఇలా ఆలోచిస్తూ ఉండాలంటే చాలా కష్టం గా అన్పించింది. అప్పటివరకూ టైం పాస్ చేయాలనుకున్నాడు.
తనకి తెలిసిన టైం పాస్ సినిమా మాత్రమే. టౌన్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కొత్త సిన్మాల పోస్టర్లు చాలనే చూశాడు. ఇది సీజన్ కాదు కాబట్టి పెద్ద హీరోల సినిమాలు ఒక్కటి కుడా లేవు. తనకు ఇప్పుడు అవన్నీ ఆలోచించాలని లేదు, ఆటో మాట్లాడుకొని థియేటర్ కి వెళ్ళాడు.
…………………………………………………………………………
ఉదయం 11:30 , మార్నింగ్ షో
సిన్మా చూస్తూ వేరే విషయం గురుంచి ఆలోచించడం ఇదే మొదటిసారి. తను ఏ చెత్త సిన్మాకి వెళ్ళినా స్క్రీన్ మీద తప్ప వేరే ధ్యాస వుండేది కాదు.
వరుణ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు . చాలా మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చదివే ప్రయివేట్ కాలేజిలోనే తనూ చదువుతున్నాడు. ఇంకో 6 నెలలు ఓపిక పడితే ఎంసెట్ ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి. ఇటువంటి సమయం లో తను ఇలా ఆలోచిస్తున్నాడు అంటే, తనకే బాధగా అన్పించేది.
తన పేరెంట్స్ ఆ కాలేజీ లో జాయిన్ చేయించడానికి ఎంత కష్టపడ్డారో!……….
వాళ్ళు ఫీజు కట్టడానికి అప్పు చేసిన సంగతి తను ఎప్పటికీ మర్చిపోవాలనుకోవడం లేదు. పది వరకూ గవర్నమెంట్ స్కూల్ లోనే వరుణ్ చదువుకున్నాడు. చదువుకోవడానికి ఇంత ఫీజులు కట్టాలని, అప్పులు కూడా చేయాలని తనకు మొట్టమొదటి సారి తెలిసింది ఇక్కడ జాయిన్ అయినప్పుడే.
ఇలాంటి ఆలోచనలతోనే సిన్మా అయిపోయింది. థియేటర్ నుంచి బయటకి వచ్చాడు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి వెళ్లి మసాలా దోశ తిన్నాడు.
ఇంకా చాలా టైం వుంది. ఈ టౌన్ లో ఒంటరిగా, ప్రశాంతగా కూర్చోవడానికి మంచి ప్లేసే లేదు. దానికి తోడు తన చేతిలో లగేజి కూడా వుంది. అందుకే ఆటో మాట్లాడి ఇంకో థియేటర్ కి వెళ్ళాడు.
………………………………………………………………………
మధ్యాహ్నం 2:45 , మ్యాట్నీ షో
టికెట్ తీసుకొని నేరుగా వెళ్లి సీట్లో
కూర్చున్నాడు. సీట్లన్నీ ఖాళీగా వుండటంతో లగేజిని పక్క సీట్లో వేసి ముందు సీట్ మీద కాలు పెట్టి దర్జాగా కూర్చొన్నాడు. ఏ. సి రూములో దొరికే ఈ దర్జా కోసమే తను చాలా సార్లు సిన్మాలకి వెళ్తుంటాడు కూడా…
పది ఎగ్జామ్స్ తర్వాత తెలిసింది తనకి…. తను పోటీ లో వున్న గుర్రాన్ని అని!…
ఆటల్లో పోటీ ఉంటుందని, చిన్నప్పటి నుంచి ఆటలే ఆడటం మానేశాడు తను. ఒక వేళ ఆడినా ఎప్పుడూ ఓడిపోయేవాడు. కానీ ఓడిపోయానని ఎప్పుడూ బాధ పడలేదు. ఎందుకంటే, తనకి పోటీ అంటే ఖచ్చితంగా ఓడిపోతాను అని తెలుసు కాబట్టి.
కానీ ఈ ఎంసెట్ ఎగ్జామ్స్ అనేవి ఆటల్లా కాదు… ఇవి వేరే… వీటిలో తక్కువ మార్కులు వస్తే, ఇంక జీవితం అంతే..
సినిమా నుంచి బయటికి వచ్చేసరికి ఐదున్నర అయింది. బయట పానీ పూరీ బండి దగ్గర ఒక మసాలా పూరి తిన్నాడు. ఒకే కాంపౌండ్ లోనే మూడు థియేటర్ లు పక్క పక్కనే ఉన్నాయి. తర్వాత పక్క థియేటర్ టికెట్ కౌంటర్ వైపుకు నడిచాడు.
………………………………………………………………………
సాయంత్రం 6:30 , ఫస్ట్ షో
సిన్మా స్టార్ట్ అయ్యేముందు పైకి లేచే తెర , ఆ స్క్రీన్ మీద బ్యానర్ పేరు ,సినిమా పేరు పడే విధానం,…..ఇవన్నీ చూడటం వరుణ్ కి చాలా ఇష్టం. థియేటర్ మొత్తం లైట్స్ ఆఫ్ చేసి ఒక్కసారిగా తెర మీద వెలుగు పడగానే ఒక విధమైన సంతోషం వేస్తుంది తనకి.
ఇప్పుడు మాత్రం , తన కి శూన్యం లో ఉన్నట్టే వుంది. తనకు వచ్చే చాలా ఆలోచనలు తనకు ఎటువంటి సంతోషాన్నీ ఇవ్వడం లేదు.
చదువంటే ఇంత భయంకరంగా ఉంటుందా?? .
అక్కడ ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకూ కూర్చొని ..కూర్చొని… బుర్ర మొద్దులా తయారయ్యేది. ఇలాంటి చదువును తను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. తర్వాత చదువులు కూడా ఇలాగే వుంటాయేమో తెలియదు. తను ఆ కాలేజీ లో వున్నప్పుడు, ఒక మంద లో తప్పిపోయిన గొర్రె పిల్లలా తికమక పడేవాడు.
సినిమా చాలా తొందరగానే ఐపోయినట్టు అన్పించింది తనకి. మళ్ళీ ఆ లగేజీ ని తీసుకొని హోటల్ కెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ ఆర్డరిచ్చాడు. సగం ప్లేట్ మాత్రమే తినగలిగాడు. మిగిలింది అక్కడే వదిలేసి తన లగీజేతో మరో థియేటర్ వైపు నడిచాడు.
…………………………………………………………………………
రాత్రి 9:45 , సెకండ్ షో
తన ఫ్రెండ్ తో కలిసి మొదటిసారి 7 వ క్లాసు లో సెకండ్ షో సినిమా కి వెళ్ళాడు. మధ్యలోనే నిద్రపోతానేమో అనుకున్నాడు…కానీ అలా జరగలేదు. అప్పటి నుంచి సెకండ్ షో కి వెళ్ళడం అంటే తన ధైర్యానికి, సాహసానికి ఒక కొలమానం గా అనుకునేవాడు…
కానీ ఇప్పుడు చాలా భయం గా వుంది. ఎందుకంటే ఈ రోజుకి ఇదే ఆఖరి షో.ఈ షో అయిపోయిన తర్వాత తను ఇన్ని రోజులు నుంచి ఏం ఆలోచించాడో…అది చేయాలి. అది అంత ఈజీ కాదు.
ఈ చదువుల కి భయపడి సూసైడ్ చేసుకున్న చాలా మంది విద్యార్థుల మాదిరిగా తను కూడా చనిపోవాలని అనుకోవడం లేదు!!.
అలాగని ఇంట్లో వాళ్లకు చెప్పుకోవాలని కూడా లేదు…. వాళ్ళకి ఇట్లాంటి చదువులు చదివితేనే గొప్ప.. కాబట్టి వాళ్ళకి తను చెప్పేది అస్సలు అర్థం కాదు అన్పించింది.
ముఖ్యంగా తనకు ఆ నోటీసు బోర్డ్ లో అతికించే ఆ 1 నుంచి 10 ర్యాంకుల లిస్టు చూడాలనుకోవడం లేదు.
మార్కులు తక్కువ వచ్చినోళ్ళ తో పాటు బయట నిలబడాలని అస్సలు లేదు…….. వీటన్నిటి నుంచి తప్పించుకోవాలని ఆలోచించాడు.
అందుకే దూరంగా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. చాలా మందికి అది పారిపోవడం లాగా అన్పించవచ్చు.
రాత్రి 12:30 కి హైదరాబాద్ కి బస్సు. అక్కడ తనకు ఎవరూ తెలియదు. కానీ బతకవచ్చన్న చిన్న ధైర్యం తో ఈ సాహసం చేసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు.
……………………………………………….. ………………………………………………..